భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR ) సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎన్నికల తర్వాత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ (Congress Party)లో చేరిన నేపథ్యంలో వీరిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ వేసిన పిటిషన్‌పై ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు.
సుప్రీంకోర్టులో విచారణ ఇలా..
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్లతో కలిపి కేటీఆర్ వేసిన పిటిషన్‌ను విచారించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం నిర్ణయించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద తదితరులు కూడా ఇదే అంశంపై పిటిషన్లు దాఖలు చేయగా వాటిని కూడా ఈ కేసుతో కలిపి విచారిస్తోంది. సోమవారం ఈ కేసును ధర్మాసనం విచారించగా బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు నైతికతను విస్మరించారని, ప్రజలు ఒక పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే స్వప్రయోజనాల కోసం మరో పార్టీలోకి మారడం సరికాదని పేర్కొన్నారు. వీరిని తక్షణమే అనర్హులుగా ప్రకటించి, ఉప ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఈ కేసును ఫిబ్రవరి 10న విచారించేందుకు అంగీకరించింది.
స్పీకర్ తీరుపై సుప్రీం అసంతృప్తి
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయమై స్పీకర్ (Telangana Speaker) ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదని విచారణ సందర్భంగా న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. దీంతో స్పీకర్ తీరుపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. తగిన నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయడం సరికాదని అభిప్రాయపడింది. మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత? మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
స్పీకర్‌కు మరింత సమయం అవసరమా? లేక ఇప్పటివరకు జరిగిన ఆలస్యం చట్ట విరుద్ధమా? అనే అంశంపై కూడా కోర్టు చర్చించింది. స్పీకర్‌కు ఎంత సమయం కావాలో మీరే కనుక్కుని చెప్పండి అని ఆయన తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








