జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: ప్రజలు బీఆర్ఎస్ ప్రగతిని గుర్తు చేసుకోవాలి – KTR
Hyderabad | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసపూరిత పాలనను తూకం వేసి సరైన నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) విజ్ఞప్తి చేశారు. శనివారం షేక్‌పేట్ డివిజన్లోని రిలయన్స్ జూబ్లీకేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ పాలన నడుపుతోందని విమర్శించారు. “తెలంగాణలో మైనార్టీ ప్రాతినిధ్యం లేకుండా తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆరుగురు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వని కాంగ్రెస్‌పై అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ కలిసే పనిచేస్తున్నాయి..
కేటీఆర్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పలు కాంట్రాక్టులను బీజేపీ ఎంపీలకు ఇస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీలను బీ టీమ్‌గా పిలిచే కాంగ్రెస్-బీజేపీలు వాస్తవానికి ఒకటే,” అని విమర్శించారు. అలాగే, “రాహుల్‌గాంధీ ఇతర రాష్ట్రాల్లో యూపీ బుల్డోజర్ పాలన ప్రస్తావిస్తూ విమర్శిస్తారు. కానీ మన తెలంగాణలో పేదల ఇళ్లపై బుల్డోజర్ చర్య రేవంత్ రెడ్డి పాలన రాహుల్‌కు కనిపించడం లేదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని బీజేపీ రాష్ట్రాలకంటే ముందుగా అమలు చేసిందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ అభివృద్ధిపై వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ మహానగరంలోని సమస్యల పరిష్కారంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని కేటీఆర్ తెలిపారు. “మేము 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా అందించాం. శాంతి భద్రతలను కాపాడాం, మత రాజకీయాలకు తావు లేకుండా విశ్వనగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం,” అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే మైనారిటీల అభివృద్ధికి 204 గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ విద్య కోసం రూ.20 లక్షల స్కాలర్షిప్ పథకం ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “ఈ విద్యాసంస్థల్లో చదివిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారై రాణిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌పై కేటీఆర్ ఆగ్రహం
“అడ్డగోలు హామీలు, మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. రైతు నుంచి విద్యార్థి వరకు, మహిళ నుంచి ఉద్యోగి వరకు ఎవరికీ న్యాయం చేయలేదు. ప్రజలు ఈసారి సరైన నిర్ణయం తీసుకుని బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి,” అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    