Kurnool Bus Fire Accident | కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ వోల్వో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
పోలీసుల సమాచారం ప్రకారం, బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 23 మంది సుక్షితంగా బయటపడ్డారు. మిగతా ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు.
ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏమన్నారు?
ఈ ప్రమాదం రాత్రి 2.45 నుంచి 3 గంటల మధ్య జరిగిందని, ఓ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఇంధన మూత తెరుచుకొని నిప్పురవ్వలు తగిలి మంటలు చెలరేగాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.
“షార్ట్ సర్క్యూట్ వల్ల బస్సు తలుపులు లాక్ కావడంతో ప్రయాణికులు బయటకు రావడానికి వీలు కాలేదు. కేవలం నిమిషాల్లోనే బస్సు మొత్తం మంటల్లో కాలిపోయింది” అని తెలిపారు.
ప్రాణాలతో కొట్టుమిట్టాడి..
బయటపడ్డవారిలో చాలా మంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. బస్సు మంటల్లో చిక్కుకుని దహనమైన మృతదేహాలను గుర్తించడం పోలీసులకు కష్టతరమవుతోంది. కాగా ఈ ఘోర ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
“కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ఈ వినాశకర బస్సు అగ్నిప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడినవారికి, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తుంది,” అని చంద్రబాబు X లో పేర్కొన్నారు.
అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Accident : దర్యాప్తు ప్రారంభం
ప్రమాదానికి సాంకేతిక లోపమా లేక నిర్లక్ష్యమా కారణమో తెలుసుకోవడానికి రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. అదేవిధంగా బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    