LK Advani : మాజీ ఉప ప్రధాని, బీజేపీ విశ్రాంత దిగ్గజ నేత ఎల్.కె. అద్వానీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి (Apollo Hospital) ఐసీయూలో ఆయన శనివారం చేరారు. అద్వానీ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. న్యూరాలజీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలో అద్వానీ చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన్ను ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే.. ఈసారి ఆస్పత్రిలో చేరడానికి కారణం ఇంకా వెల్లడికాలేదు.
ఇదే ఆస్పత్రిలో అద్వానీ చేరడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది తొలిరోజుల్లో ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆతర్వాత జూలైలో కూడా అద్వానీ ఇదే ఆస్పత్రిలోని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. అలాగే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆగస్టులో ఆయన ఆస్పత్రిలో చేరారు. అప్పుడు కూడా ఆ హాస్పిటల్ ప్రత్యేక బులిటిన్‌ను విడుదల చేసింది. ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని, వైద్యం అనంతరం డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించింది.
LK Advani రాజకీయ ప్రస్థానం
ఎల్.కె. అద్వానీ బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రాంతంలో ఉన్న కరాచీ నగరంలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14వ ఏట ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరారు. 1947లో భారత విభజన సమయంలో ఆయన కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. రాజస్థాన్‌లో స్థిరపడింది. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో స్థాపించిన భారతీయ జన సంఘ్‌లో అద్వానీ చేరారు. పార్టీ సాంస్కృతిక భావజాలం, హిందూత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 1957లో ఆయన పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. 1972లో భారతీయ జన సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ఎమర్జెన్సీ కాలంలో..
ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. దీంతో విపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని అద్వానీ, ఆయన సన్నిహితుడు అటల్ బిహారీ వాజ్‌పేయి వ్యతిరేకించారు. ఈ క్రమంలో వీరద్దరితోపాటు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు అరెస్టయ్యారు. జైల్లో ఉన్నప్పటికీ పార్టీ పరంగా ప్రజాదరణను పెంచేలా అద్వానీ కృషి చేశారు.
ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అద్వానీ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి మంత్రివర్గంలో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు.
బీజేపీ స్థాపన
జనతా పార్టీతో విభేదాలు చోటుచేసుకోవడంతో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఇతర నాయకులతో కలిసి అద్వానీ 1980లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని స్థాపించారు. ఆయన నేతృత్వంలో హిందూత్వ భావజాలాన్ని రాజకీయ రంగంలో ముందుకు తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది.
రామజన్మభూమి 1989లో ప్రారంభం కాగా అద్వానీ నాయకత్వం వహించారు. 1990లో ఆయన చేపట్టిన రథయాత్ర భారతీయ రాజకీయాల్లో ప్రత్యేక మలుపుగా నిలిచింది. ఈ యాత్ర ద్వారా బీజేపీకి దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు లభించింది. వాజ్‌పేయి నేతృత్వంలో 1998లో ఏర్పడిన ప్రభుత్వంలో అధ్వానీ హోం శాఖ మంత్రిగా పనిచేశారు. 2002లో ఆయనను భారతదేశ ఉప ప్రధాని పదవి వరించింది. ఈ పదవిలో ఆయన దేశ భద్రత, పరిపాలనలో కీలక మార్గదర్శకాలు అందించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..