Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అపశ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచరించే సమయంలో తొక్కిసలాట జరిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బారికేడ్లు విరిగిపడి..
మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రదేశమంతా కిక్కిరిసిపోవడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
Maha Kumbh Stampede : ఆస్పత్రుల్లో క్షతగాత్రులు
మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అనేక మంది మరణించారని, మరికొందరు గాయపడ్డారని సమాచారం. గాయపడిన వారిని వెంటనే మహా కుంభామేళా (Maha Kumbh) ప్రాంగణంలోని ఆస్పత్రులకు తరలించారు. మరింత తీవ్రంగా గాయపడిన వారిని బైలీ ఆస్పత్రి, స్వరూప్ రాణి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు.
పుణ్యస్నానాలు ఎందుకంటే…
మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. 144 సంవత్సరాలకోసారి వచ్చే ‘త్రివేణి యోగ’ అనే అరుదైన ఖగోళ ఘట్టం ఈసారి కుంభామేళా సందర్భంగా వచ్చింది. దీంతో మౌని అమావస్య మరింత విశేషంగా మారింది. పురాణాల ప్రకారం మౌని అమావాస్య రోజు గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందికొస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ సమయంగా గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తారు. ఈసారి మహాకుంభామేళా వంటి అత్యంత గొప్ప ఆధ్యాత్మిక వేడుక మౌని అమావాస్య సందర్భంగా వచ్చింది. దీంతో కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద సమ్మేళనం కుంభామేళా. ఆరు వారాలపాటు సాగే ఈ మహోత్సవానికి 40 కోట్ల మంది హాజరవుతారని అంచనా. ఇప్పటికే 14 కోట్ల మంది కుంభామేళాకు వచ్చారు. మౌని అమావాస్య సందర్భంగా సుమారు 10 కోట్ల మంది భక్తులు స్నానం చేయడానికి తరలి వచ్చారు.
స్పందించిన ప్రధాని మోదీ
కుంభామేళాలో అపశ్రుతి (Maha Kumbh Stampede) చోటుచేసుకోవడంపై ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath)తో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ముఖ్యమంత్రితో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు. మరోవైపు భక్తులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోరారు. గంగా నదికి సమీపంలోని ఘాట్లలో స్నానం చేయాలని, సంగమం వైపు వెళ్లొద్దని సూచించారు.
అఖాడాల సంప్రదాయ స్నానం వాయిదా
మహా కుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున సంగమ ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా అఖాడాల సంప్రదాయ స్నానాన్ని వాయిదా వేశారు. ఈ మేరకు అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి ప్రకటించారు. ఘాట్ వద్ద ఏర్పడిన భారీ జనసందోహం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనుమతి లభించిన వెంటనే అఖాడాల సంప్రదాయ స్నాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..