హైదరాబాద్: మహా శివరాత్రి (Maha Shivaratri) పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. బుధవారం ఉదయం వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలిరావడం మొదలైంది. శివుడికి భక్తిశ్రద్ధలతో మారేడు దళాలు సమర్పించి అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మహదేవుడి దర్శనం కోసం ఎండను సైతం లెక్కచేయకుండా భారీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఓం నమఃశివాయ్య పంచాక్షరీ మంత్రంతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి.
Vemulawada Rajanna Temple : దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వర స్వామి వారికి ప్రభుత్వం తరపున బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తరఫున కూడా టిటిడి డిప్యూటీ ఈవో లోకనాథం, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఇక వేమువాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. ఆలయ అర్చకులు వేకువజామునే స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి అద్దాల మండపంలో అనువంశిక అర్చకులతో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
Maha Shivaratri : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో..
ఇక తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు.. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున దేవాలయం, కీసర గుట్ట శివాలయం, భీమదేవరపల్లి మండలం వీరభద్ర స్వామి దేవాలయం, భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేయిస్తంభాల దేవాలయం, రామప్ప దేవాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరాలయంలో ఐనవోలు మల్లికార్జున దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








