Mahakumbh Mela 2025 : ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం సంగమం మహాకుంభ మేళాకు కోట్లాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. దేశవిదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించి తరిస్తున్నారు. ఇప్పటికే ఏడు కోట్ల మంది స్నానాలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుంభ మేళాకు వెళ్తుండడంతో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) తాజాగా ఫిబ్రవరి 15న సికింద్రా బాద్ నుంచి ప్రయాగ్ రాజ్(Prayagraj)కు ప్రత్యేక రైలును ప్రకటించింది. ఎనిమిది రోజుల పాటు కొనసాగే యాత్రా స్పెషల్ ప్యాకేజీ ఇది.
వారణాసి, అయోధ్య, ప్రయాగ్ రాజ్
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా(Mahakumbh Mela 2025)కు వెళ్లే భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు 22న మళ్లీ ఇక్కడికి చేరుకుంటుంది. వారం రోజుల పాటు జరిగే ఈ మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక రైలు ద్వారా పలు ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను దర్శించుకుని ఎనిమిది రోజుల్లో తిరిగి చేరుకునేందుకు వీలుగా ఈ ప్యాకేజీని రూపొందించింది ఐఆర్‌సిటీసీ. మొత్తం 578 మంది సామర్థ్యంతో కూడిన ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి 18న ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది. ఈసందర్భంగా కుంభమేళాలో భక్తులు పాల్గొనవచ్చు.
కుంభమేళా దర్శనం అనంతరం ఫిబ్రవరి 19వ తేదీన వారాణసీలో కాశీవిశ్వనాథ్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను దర్శించుకుని, ఆ రాత్రి అక్కడే బస చేసి 20న అయోధ్యకు చేరుకుంటారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి, హనుమాన్ గర్హిని సందర్శించిన అనంతరం తిరుగు పయనమవుతారు. తిరిగి ఈ ప్రత్యేక రైలు 22 రాత్రికి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది.
హాల్టింగ్ స్టేషన్స్
ఈ రైలు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, చత్రపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలసూర్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.
యాత్ర ప్యాకేజీలో ఎకానమీ (ఎస్‌ఎల్) పెద్దలకు రూ.23,035, పిల్లలకు (5-11 ఏళ్లలోపు) రూ.22,140లుగా చార్జీలు ఖరారు చేశారు. ఏసీ బోగీల చార్జీలు వేరుగా ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఈ టూర్ పూర్తి వివరాల కోసం IRCTC అఫీషియల్ వెబ్‌సైట్ www.irctc.co.in విజిట్ చేయండి.
Mahakumbh Mela 2025: టికెట్ ధరలు ఇలా
- థర్డ్ ఏసీలో సింగిల్ షేరింగ్ – రూ. 48,730
- డబుల్ షేరింగ్ – రూ. 31,610
- ట్రిపుల్ షేరింగ్ – రూ. 29,390
- 5-11 ఏళ్ల చిన్నారుల కోసం..
- (విత్ బెడ్) – రూ. 22,890
- వితౌట్ బెడ్ – రూ. 14,650
- స్లీపర్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్ – రూ. 45,700
- డబుల్ షేరింగ్ – రూ. 28,570
- ట్రిపుల్ షేరింగ్ రూ. 26,360
- 5-11 ఏళ్ల చిన్నారులు:
- విత్ బెడ్ రూ. 19,860
- వితౌట్ బెడ్ – రూ. 11,620
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..