మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘటన కలకలం రేపింది. ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యల్లో యంత్రాంగం
ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన్న ప్రాంతంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
క్షతగాత్రుల పరిస్థితి విషమం
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడుకు కారణాలు ఏమిటి?
పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు ప్రాథమిక విచారణను ప్రారంభించారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పనిచేసే విధానాలను, భద్రతా ప్రమాణాలను సమీక్షించడానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
Maharashtra CM ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి
మహారాష్ట్ర ప్రభుత్వం (Maharashtra Govt ) ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Chief Minister Devendra Fadnavis) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందించనుంది. గాయపడిన వారి వైద్యం కోసం ప్రత్యేక నిధులు కేటాయించనుంది.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల భద్రతపై ప్రశ్నలు
మిలటరీ అవసరాలకు ఆయుధాలను, పేలుడు పదార్థాలను తయారు చేసే ఈ ఫ్యాక్టరీ భద్రతా ప్రమాణాలపై ఈ ఘటన ప్రశ్నలు లేవనెత్తింది. ఇలాంటి కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఘటనా సమయంలో భద్రతా నిబంధనలను పాటించడంలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా? అనేది చర్చనీయాంశమైంది. భద్రతా నిబంధనల పరంగా ఫ్యాక్టరీ నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నారనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు రక్షణ చట్టాలను మరింత కఠినంగా అమలు చేయనుంది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
స్థానికుల్లో భయాందోళనలు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పక్కనే ఉన్న ఇళ్లపై కూడా దీని ప్రభావం పడి అవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. స్థానిక ప్రజలు తమ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..