Manmohan Singh : మన్మోహన్ సింగ్.. మృదు స్వభావి. నోట్లో నాలుక ఉండదన్నట్టే కనిపించిన ఆయన ఓ నిశ్శబ్ద విప్లవం. రెండు సార్లు ప్రధానిగా ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్తగా తనకున్న అనుభవంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్యమాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మన్మోహన్ సింగ్ (92) మృతి చెందారనే వార్త భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయామనే విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థికరంగ డాక్టర్.. Manmohan Singh
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జన్మించిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొందారు.
ప్రధానిగా రెండుసార్లు
మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్లపాటు రెండు పర్యాయాలు ప్రధానిగా కొనసాగారు. 2004 లోక్ సభ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) నేతృత్వంలోని ఎన్డీయేపై కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా 2004లో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009 నుంచి 2014 వరకు రెండోసారి పదవిలో కొనసాగారు. పీవీ నరసింహారావు (PV. Narasimha Rao) ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో 1991-1996 మధ్య మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
ఆత్మస్థైర్యం కోల్పోని మనో నిబ్బరం
స్వయాన ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh) ప్రధానిగా తనకున్న అధికారాలతో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోశారనే గుర్తింపును పొందారు. ప్రతిపక్షాలు సైతం ప్రశంసించేలా అనేక సంస్కరణలతో దేశానికి కొత్త దిశ చూపారు. ప్రధాని కాకముందు కేంద్ర ఆర్థిక మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ అనేక మార్పులకు నాంది పలికారు. అయితే.. కొన్ని విమర్శలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఒకవైపు ప్రధానిగా ఆయన చేసిన సేవలను అభినందనలు వ్యక్తమవుతున్న క్రమంలోనే మరోవైపు ఆరోపణలూ వచ్చాయి. అయినా మన్మోహన్ సింగ్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు.
‘ఎవరేమన్నా నాపై నాకు ఆత్మవిశ్వాసం ఉంది. చరిత్ర నన్ను సానుకూలంగా చూడగలదు’ అని 2014లో తన రెండో పదవీ కాలం ముగిసే సమయంలో మన్మోహన్ సింగ్ అన్నారు.
మన్మోహన్ సింగ్ విధానాల్లో ముఖ్యంగా..
భారత ఆర్థిక సంస్కరణలకర్త అని గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా (1991), ప్రధానమంత్రి (2004-2014) గా పనిచేసిన కాలంలో ఆయన అనేక సంస్కరణలతోపాటు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. 1991లో నరసింహారావు (P. V. Narasimha Rao) ప్రధానిగా ఉన్నకాలంలో ఆర్థికమంత్రి (Finance Minister)గా కొనసాగారు. అప్పట్లో తీవ్ర ద్రవ్యలోటు ఏర్పడిన భారత్ చెల్లింపుల సమతుల్యత సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991 జూలైలో రిజర్వ్ బ్యాంక్ 46.91 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్ బ్యాంక్, జపాన్ బ్యాంక్ వద్ద పెట్టి 400 మిలియన్ల డాలర్లను సేకరించింది. అనంతరం రూపాయి విలువ తగ్గించడం ద్వారా భారత ఎగుమతులు గ్లోబల్ మార్కెట్లో పోటీగా నిలిచాయి. అలాగే 1991 జూలై 24న మన్మోహన్ సింగ్ కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. ‘లైసెన్స్ రాజ్’కు ముగింపు పలికారు. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో సంస్కరణలు సంస్కరణలు తీసుకొచ్చి సాంకేతిక మార్పుల ఆధారంగా అధిక పోటీకి అవకాశం కల్పించారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు 100 రోజుల ఉపాధి కల్పించేందుకు ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ (MGNREGA)ను ప్రవేశపెట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తెచ్చి గ్రామీణుల కుటుంబాలకు ఆర్థిక వెసలుబాటు కల్పించారు. సమాచార హక్కు (RTI), విద్యా హక్కు (RTE) వంటి ముఖ్యమైన చట్టాలకు రూపకల్పన చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..