Hyderabad | మావోయిస్టు పార్టీ (Maoist party ) కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్ర నాయకులు వరుసగా లొంగిపోవడం పార్టీకి మింగుడుపడడం లేదు. తాజాగా ఆ పార్టీ కీలక నేత, తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యుడు, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్ పోలీసులకు లొంగిపోయారు. మంగళవారం ఆయన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో అధికారులకు లొంగిపోతున్నట్లు ప్రకటించారు.
బండి ప్రకాశ్ ప్రస్థానం
గత 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన బండి ప్రకాశ్, తెలంగాణలో ఆ పార్టీ కార్యకలాపాల్లో ప్రధాన పాత్ర పోషించారు. మొదట సింగరేణి కార్మికుడిగా పనిచేశారు. 1980లో పీపుల్స్ వార్ ఉద్యమాలతో ఆకర్షితుడై, సింగరేణి కార్మిక సమాఖ్యలో చేరారు. 1988లో బెల్లంపల్లి ప్రాంతంలో కమ్యూనిస్ట్ నేత అబ్రహం హత్య కేసులో ప్రకాశ్ అరెస్టయ్యారు.
ఆదిలాబాద్ సబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న కాలంలో నాటి ప్రముఖ నాయకులు నల్లా ఆదిరెడ్డి, మహమ్మద్ హస్సేన్, ముంజ రత్నయ్య గౌడ్ తదితరులతో కలిసి జైలు గోడలు బద్దలుకొట్టి తుపాకులతో సహా తప్పించుకుని పరారయ్యారు. ఈ ఘటన ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
ఆ తర్వాత 1991లో మళ్లీ అరెస్ట్ అయిన బండి ప్రకాశ్, 2004 జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కాలంలో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో, మళ్లీ అటవీ బాట పట్టారు. తదనంతరం గత 20 ఏళ్లుగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీలో కీలక నాయకుడిగా కొనసాగారు.
లొంగుబాటుకు కారణాలేంటీ?
వయస్సు, ఆరోగ్య సమస్యలు, మరియు పార్టీ అంతర్గత పరిస్థితుల కారణంగా బండి ప్రకాశ్ పార్టీ కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. డీజీపీ శివధర్ రెడ్డి ఆయన లొంగుబాటును స్వీకరించి, ప్రభుత్వం అందించే పునరావాస పథకాల వివరాలు తెలియజేశారు. రాగా తెలంగాణ పోలీసులు ఈ సరెండర్‌ను స్వాగతిస్తూ, “ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా సామాన్య జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    