Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.
జనవరి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూజారులు కోరారు.
మంత్రి సీతక్క హర్షం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర (Medaram jatara) తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర తేదిలను ప్రకటించిన పూజారుల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. కోట్ల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృ త ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పుడు మహజాతర తేదీలను ప్రకటించడంతో… పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. రూ.110 కోట్లతో మేడారం లో అభివృద్ది పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.