Medaram Mini Jatara 2025 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ (Medaram Sammakka Saralamma ) మినీ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ వేడుక కొనసాగనుంది. రెండేళ్లకోసారి మహాజాతర జరుగుతుండగా మధ్యలో ఈ చిన్న జాతరను నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది మహాజాతర జరిగింది. మళ్లీ 2026లో నిర్వహించనున్నారు. మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమైంది.
మినీ జాతర చరిత్ర
పూర్వం మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. మాఘ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల ముందు వచ్చే బుధవారం గిరిజనులు (Koya community) పాత గుడిసెలను తొలగించి, కొత్త వాటిని నిర్మించి భక్తి శ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత పౌర్ణమికి మహాజాతర నిర్వహించడం ఆనవాయితీగా మారింది. తదుపరి ఏడాది మాఘ శుద్ధ పౌర్ణమి రోజు గిరిజనులు జాతరకు బదులుగా కేవలం మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఈ పండుగలో దేవతలకు శాంతి పూజలు చేసేవారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు, మహాజాతర సమయంలో రాలేనివారు ఈ జాతరకు వచ్చేవారు. ఈ విధంగా మండమెలిగే పండుగ చిన్న జాతరగా మారింది. ఈ ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు జాతరకు వస్తారని అంచనా.
మేడారం మినీ జాతర.. నాలుగురోజులు ఇలా…
మేడారం (Medaram )లోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ దేవాలయాలను నేడు ఆదివాసీ పూజారులు శుద్ధి చేశారు. హద్దుల్లో ద్వార స్తంభాలు కట్టి, గ్రామ నిర్బంధం చేశారు. ఫిబ్రవరి 13న సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద పసుపు, కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 14న భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 15న ఆలయ పూజారులు గిరిజన సంప్రదాయం ప్రకారం అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తారు.
Medaram Jatara లో భక్తులకు సౌకర్యాలు
మినీ మేడారం జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం రూ.5.30 కోట్లు మంజూరు చేసింది. జంపన్న వాగులో స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు విడిది చేసే ప్రాంతాల వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లు, తాగునీటి కోసం నల్లాలు ఏర్పాటు చేశారు. 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే భక్తుల కోసం హెల్త్ సబ్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చారు. 400 మంది కార్మికులతో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
వాహనాల మళ్లింపు ఇలా..
- భూపాలపల్లి, కరీంనగర్ నుంచిఇ వచ్చే వాహనాలు కొత్తూరు లో లెవల్ కాజ్‌వే ద్వారా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి. తిరుగు ప్రయాణంలో చింతల్ క్రాస్ ద్వారా వెళ్లాలి.
- హైదరాబాద్, వరంగల్ నుంచి పస్రా మీదుగా మేడారానికి వచ్చే వాహనాల కోసం ఐటీడీఏ క్యాంపు కార్యాలయం, ఎదురుకోళ్ల మందిరం వద్ద పార్కింగ్ సౌకర్యం ఉంది. తిరుగు ప్రయాణంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ పక్కనుంచి వెళ్లాలి.
- హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా రావాలి. కరీంనగర్, భూపాలపల్లి మీదుగా చింతల్ క్రాస్ నుంచి మేడారం బస్టాండ్‌కు చేరుకుని, వచ్చిన మార్గంలో తిరిగి వెళ్లాలి.
- భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీస్‌గఢ్, ఏటూరునాగారం నుంచి తాడ్వాయి మీదుగా వచ్చే వాహనాలు అదే మార్గంలో తిరిగి వెళ్లాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








