Indian Railway News : కరోనా మహమ్మారి సమయంలో నిలిచిపోయిన అనేక రైలు సేవలలో ముఖ్యమైనది ముంబై–కరీంనగర్ ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఇప్పుడు ఆ రైలు మళ్లీ పట్టాలెక్కింది. దీని పునఃప్రారంభంతో రెండు నగరాల మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు అందరికీ ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
కరోనా తర్వాత రైలు మళ్లీ ప్రారంభం
కరోనా (COVID-19) కాలంలో విధించిన పరిమితుల కారణంగా అనేక రైళ్లు నిలిచిపోయాయి. వాటిలో ముంబై – కరీంనగర్ వెళ్లే ఈ రైలు కూడా ఒకటి. ఈ సర్వీస్ నిలిచిపోవడంతో రెండు నగరాల మధ్య రాకపోకలు కష్టంగా మారాయి. ప్రయాణికుల (passengers) నుంచి నిరంతరం వస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న రైల్వే శాఖ చివరికి ఈ సర్వీస్ (Mumbai–Karimnagar)ను మళ్లీ ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ముంబైలో ఉద్యోగాలు చేసే కరీంనగర్ ప్రాంత ప్రజలు, అక్కడ చదువుకునే విద్యార్థులు, అలాగే బిసినెస్ కోసం రాకపోకలు చేసే వ్యాపారవేత్తలకు పెద్ద ఊరట లభించనుంది.
వారానికి ఒక్కసారి – కొత్త షెడ్యూల్ వివరాలు
కొత్త షెడ్యూల్ (schedule) ప్రకారం.. ఈ రైలు ప్రస్తుతం వారానికి ఒక్కసారి (Weekly train) మాత్రమే నడవనుంది.
- లోకమాన్య తిలక్ టర్మినస్ (LTT) నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు రైలు బయల్దేరుతుంది.
- తదుపరి రోజు బుధవారం ఉదయం 10.00 గంటలకు కరీంనగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
- అదే రోజు (బుధవారం) సాయంత్రం 5.30 గంటలకు కరీంనగర్ నుంచి బయల్దేరి ముంబై చేరుకుంటుంది.
 ఈ షెడ్యూల్ వల్ల ముంబైలో ఉద్యోగాలు చేసే వారు లేదా వారాంతాల్లో ప్రయాణించేవారు తమ ప్లాన్‌లను సులభంగా చేసుకోగలుగుతారని అధికారులు చెబుతున్నారు.
ప్రయాణికుల డిమాండ్‌తోనే..
కరీంనగర్ రైల్వే స్టేషన్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భానుచందర్ మాట్లాడుతూ ‘కరోనా సమయంలో నిలిచిపోయిన ఈ రైలును తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్‌ను పలు సంస్థలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంఘాలు పునరావృతంగా మా దృష్టికి తీసుకువచ్చారు. వారి అభ్యర్థనలను పరిగణపలోకి తీసుకుని చివరికి రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు.
ఇకపై ఈ రైలు ద్వారా ముంబై, పుణే వంటి మహారాష్ట్ర నగరాలకు వెళ్లాలనుకునే వారికి కూడా సౌకర్యం కలుగుతుందన్నారు. ప్రత్యేకించి విద్యార్థులు, ఉద్యోగుల కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక, సామాజిక అనుసంధానం
మహారాష్ట్రలో ఆర్థిక రాజధానిగా ముంబై ప్రసిద్ధి చెందింది. అక్కడ వేలాది మంది తెలంగాణ (Telangana) ప్రజలు వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు వారు హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ వరకు రైలులో వచ్చి, అక్కడి నుంచి బస్సులు లేదా ఇతర మార్గాల (routes)ను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ముంబై నుంచి నేరుగా కరీంనగర్ వరకు ప్రయాణించే అవకాశం ఉండటంతో వారి సమయం, డబ్బు రెండూ ఆదా కానున్నాయి. ఇది కేవలం ప్రయాణికులకే కాకుండా రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలకు కూడా కొత్త ఊపునిస్తుంది. కరీంనగర్‌లోని గ్రానైట్, టెక్ట్స్‌టైల్, వ్యవసాయ ఉత్పత్తుల వంటి పరిశ్రమలకు ముంబై మార్కెట్‌తో అనుసంధానం మరింత బలపడే అవకాశం ఉంది.
Railway News : భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు
ప్రస్తుతం వారానికి ఒక్కసారి మాత్రమే నడుస్తున్న ఈ సర్వీస్‌ను భవిష్యత్తులో రోజువారీగా నడిపే అవకాశముందని రైల్వే వర్గాలు సూచిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్ పెరిగిన కొద్దీ అదనపు రైళ్లు నడిపే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															







 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    