Stop Sexual Harassment : అతడో మనోవికాస నిపుణుడు. తన మాటలతో ఎంతటి వారినైనా ప్రభావితం చేయగల సైకాలజిస్టు (Psychologist). జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎలా కడతేర్చాలో కౌన్సెలింగ్ చేస్తాడు. సమస్యల ఊబి నుంచి బయపడే మార్గాలు చెబుతాడు. కానీ.. అతడు మరో పనిచేశాడు. సైకాలజీ పేరుతో అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. మాయమాటలు చెప్పి నీచంగా వ్యవహరించాడు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ (Nagpur)లో ఈ ఘటన వెలుగుచూసింది.
సన్మార్గం పేరుతో దుర్మార్గం
మనోవికాస పాఠాలు చెప్పి విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన ఓ సైకాలజిస్టు (Psychologist) దుర్మార్గానికి పాల్పడ్డాడు. విద్యార్థినులను బ్లాక్‌మెయిల్ (Blackmail) చేసి లైంగిక దాడి చేశాడు. 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ దుశ్చర్యలకు సుమారు 50 మంది బలి అయ్యారు. ఇన్నాళ్ల తర్వాత అతడి అఘాయిత్యాలు వెలుగుచూడ్డంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. పిల్లల లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (POCSO), ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద అతడిని రిమాండ్‌కు తరలించారు.
ఫొటోలు, వీడియోలు చూపించి..
నిందితుడు తూర్పు నాగపూర్‌లో వ్యక్తిత్వ మనోవికాస కేంద్రాన్ని నిర్వహించేవాడు. విద్యార్థులకు, ముఖ్యంగా అమ్మాయిలకు వ్యక్తిగత, వృత్తిపర అంశాలపై కౌన్సెలింగ్ ఇచ్చేవాడు. జీవితాన్నిఅభివృద్ధి పథంలో నడిపించేందుకు మార్గాలు చూపుతానంటూ క్లాసులు చెప్పేవాడు. దీనికి సంబంధించి బయట క్యాంపులు కూడా నిర్వహించేవాడు. క్లాసుల చెప్పే సమయంలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీయించేవాడు. ఆ తర్వాత వాటిని చూపించి ఆ విద్యార్థినులను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడి (Sexually exploit) చేసేవాడు.
Psychologist పాపం పండిందిలా..
సైకాలజిస్టు దురాగతాలను ఓ బాధితురాలు బయటపెట్టింది. తనపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైకాలజిస్టు తనను బ్లాక్‌మెయిల్ చేసి లైంగిక దాడి చేశాడంటూ ధైర్యంగా ముందుకొచ్చి చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి పాపాల చిట్టాను బయటికి తీశారు. వెంటనే అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.
ధైర్యం చేయకపోవడం వల్లే దారుణాలు
పోలీసుల ప్రకారం.. బాధితుల్లో చాలా మంది వివాహితులు ఉన్నారు. వారు తమ వ్యక్తిగత జీవితంపై మచ్చ పడుతుందనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంలో తొందరపడ లేదు. దీంతో అతడి అఘాయిత్యాలకు హద్దులేకుండా పోయింది. ఈ ఘటన బాధితుల జీవితాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుండగా పోలీసులు ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా అనేక మంది బాధితులు ఉండగా వారిని ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. కేసును మరింత సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితుడికి సరైన శిక్ష పడేలా రంగం సిద్ధం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..