NHAI | న్యూఢిల్లీ : 2000లో ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ వసూలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి హైవేలపై ప్రయాణికుల నుంచి దాదాపు రూ.2.1 లక్షల కోట్లను యూజర్ ఫీజుగా వసూలయ్యాయి. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేల నెట్‌వర్క్‌ను నిర్మించడానికి కేంద్రం భారీ మొత్తంలో నిధులను ఖర్చుచేస్తోంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఏకంగా రూ.2.7 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు అంచనా.
కాగా గత 24 ఏళ్లలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో నిర్మించిన రహదారుల కోసం ప్రైవేట్ హైవే నిర్మాణ కంపెనీలు సుమారు రూ. 1.4 లక్షల కోట్ల టోల్ వసూలు చేశాయని మంత్రిత్వ శాఖ గురువారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ స్ట్రెచ్‌లలో, NH-48 పరిధిలోని గుర్గావ్-జైపూర్ కారిడార్ యూజర్ ఛార్జీల రూపంలో దాదాపు రూ. 8,528 కోట్లు వసూలు చేసింది.
టోల్ సేకరణలో UP నంబర్ 1
ప్రైవేట్ కంపెనీలు PPP కింద రహదారుల నిర్మాణానికి చేసిన ఖర్చును హైవే ప్రాజెక్టులలో టోల్ ద్వారా తమ పెట్టుబడులను తిరిగి పొందుతాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 100% ప్రభుత్వ నిధులతో నిర్మించిన విభాగాల నుంచి మాత్రమే టోల్‌ను స్వీకరిస్తుంది. రాష్ట్రాలలో, ఉత్తరప్రదేశ్‌లోని హైవే వినియోగదారుల నుంచి అత్యధిక వసూళ్లు వచ్చాయి. యూపీ దేశంలోనే అతిపెద్ద హైవే నెట్‌వర్క్‌ను కూడా కలిగి ఉంది. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి టోల్ ఆదాయం లేదు.
45 వేల కిలోమీటర్ల NH పై టోల్
ప్రస్తుతం 1.5 లక్షల కిలోమీటర్ల ఎన్‌హెచ్‌లో దాదాపు 45,000 కిలోమీటర్ల మేర టోల్ వసూలు చేస్తున్నారు. కనీసం రెండున్నర లేన్లు ఉన్న హైవేలపై మాత్రమే ప్రభుత్వం టోల్ వసూలు చేస్తుంది. NHAI ఆదాయాన్ని పెంచడానికి మరిన్ని హైవేలను టోల్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. గత ఐదేళ్లలో NH ల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రభుత్వం 10.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపింది
రూ.1.44 లక్షల కోట్ల టోల్ వసూలు
డిసెంబర్ 2000 నుంచి జాతీయ రహదారులపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పిపిపి) మోడల్‌లో నిర్వహించబడుతున్న ఫీజు ప్లాజాల వద్ద ప్రభుత్వం 1.44 లక్షల కోట్ల రూపాయలను టోల్ టాక్స్‌గా వసూలు చేసింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. డిసెంబర్ 2000 నుంచి జాతీయ రహదారులపై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) మోడల్‌లో నిర్వహిస్తున్న టోల్ ప్లాజాల వద్ద యూజర్ ఫీజుగా రూ.1.44 లక్షల కోట్లు వసూలు చేసినట్లు గడ్కరీ తెలిపారు.