No Confidence motion : రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar)పై అవిశ్వాస తీర్మానికి ఇండియా (INDIA) కూటమి సిద్ధమైంది. సభను సజావుగా సాగనివ్వడం లేదని విపక్షాలపై జగ్‌దీప్ ధన్‌ఖడ్ పలుమార్లు మందలించడంతో ఆయనపై ఇండియా కూటమి ఎంపీలు గుర్రుగా ఉన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఆయన వైఖరి అధికార పక్షానికి అనుకూలంగా ఉందని, విపక్షాల పట్ల వివక్ష చూపుతున్నారని ప్రధాన ఆరోపణ. సభలో తమను మాట్లాడనివ్వకుండా చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ అడ్డుకుంటున్నారని ఇండియా కూటమి ఎంపీలు విమర్శిస్తున్నారు.
నోటీసు ఇచ్చిన ఇండియా కూటమి
చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు ఇచ్చింది. అయితే అవిశ్వాసానికి 50 మంది ఎంపీల మద్దతు అవసరం. 71 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానికి మద్దతుగా సంతకాలు చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ సహా వివిధ పార్టీలకు చెందిన మొత్తం 71 మంది ఎంపీలు సంతకాలు చేశారని పేర్కొన్నారు.
కలసి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ
తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కాంగ్రెస్‌కు కొంతకాలంగా అదానీ అంశంపై దూరంగా ఉంటున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆవరణలో నిర్వహించిన ఆందోళనల్లోనూ ఈ రెండు పార్టీలు పాల్గొనలేదు. రాజ్యసభ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి మాత్రం తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ముందుకొచ్చి నోటీసుపై సంతకాలు చేశాయి.
No Confidence motion సాధ్యమేనా?
జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆమోదం లభించడం సాంకేతికంగా సాధ్యం కాదని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం 14 రోజుల నోటీస్ పీరియడ్ ఉండాలని, శీతాకాల సమావేశాలు ముగియడానికి మరో 8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఇండియా కూటమి, ఎన్‌డీఏ కూటమిలో లేని పార్టీలు జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. భారత జనతా దళ్, బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ తదితర పార్టీలు ఇంకా తమ వైఖరిని వెల్లడించలేదు.
మద్దతు ఇస్తారో.. లేదో!
ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది ఎంపీలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానికి ఈ సంఖ్య సరిపోదు. అయితే స్వతంత్ర ఎంపీ కపిల్ సిబాల్ మద్దతును ఇండియా కూటమి పొందే అవకాశం ఉంది. అలాగే ఎన్‌డీఏకు 113 మంది ఎంపీలు ఉన్నారు. వీరితోపాటు ఈ కూటమికి ఆరుగురు నామిటెడ్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు కూడా ఉంటుంది. బీఆర్ఎస్, వైస్సార్‌సీపీ, బీజేడీ కలిస్తే మొత్తం 19 మంది ఎంపీలు ఉన్నారు.
సపోర్ట్ చేయలేమని హింట్ ఇచ్చిన బీజేడీ
నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి ఈ పార్టీ మద్దతు ఇస్తుందా? అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అవిశ్వాసమనేది ఇండియా కూటమి లేవనెత్తిన అంశమని, తమ పార్టీ ఆ కూటమిలో భాగస్వామ్యం కాదని బీజేడీ నాయకుడు సస్మిత పత్ర అన్నారు.
వైఎస్పార్‌సీపీ కూడా అంతే…
వైఎస్పార్‌సీపీకి రాజ్యసభలో ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసమేది తమకు సంబంధం లేని అంశమని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. చైర్మన్‌తో తాము సత్సంబంధాలు కలిగి ఉన్నామని ఆయన తమ వైఖరిని తెలిపారు.
డైలమాలో బీఆర్ఎస్!
అవిశ్వాస తీర్మానంపై బీఆర్ఎస్ తమ వైఖరిని స్పష్టం చేయలేదు. ఇండియా కూటమి నుంచి ఎవరైనా తమను సంప్రదిస్తే తమ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీఆర్ఎస్‌కు చెందిన ఎంపీ ఒకరు అన్నారు. దీనిపై తమ పార్టీ అధినేత కేసీఆర్ సలహా తీసుకుంటామని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..