Om Prakash Chautala | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD) నేత ఓంప్రకాశ్ చౌతాలా (89) ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. గురుగ్రాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 12 గంటలకు చౌతాలా కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. మాజీ ఉప ప్రధాని దేవీలాల్ కుమారుడైన ఓం ప్రకాశ్ హర్యానా సీఎంగా ఐదుసార్లు ప్రాతిధ్యం వహించారు.
ఆరోగ్యం క్షీణించి..
ఓంప్రకాశ్ చౌతాలా (Om Prakash Chautala) మూడు నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు ఉదయం చౌతాలా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని, దీంతో 11:35 గంటలకు ఆస్పత్రిలో చేర్చామని, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు రేపు (శనివారం) సిర్సా జిల్లాలోని స్వగ్రామమైన చౌతాలాలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
రాజకీయాల్లో తనదైన ముద్ర
ఓం ప్రకాశ్ చౌతాలా 1935 జనవరి 1న హర్యానా సిర్సా జిల్లాలోని చౌతాల గ్రామంలో జన్మించారు. మాజీ ఉపప్రధాని దేవీ లాల్ కుమారుడిగా రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. హర్యానా రాజకీయాల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. ఐదు సార్లు హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. 1989లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చౌతాలా గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఆ తర్వాత 1990, 1991, 1999, 2000లో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిచ్చి, రైతుల సమస్యల పరిష్కారానికి ఎన్నో చర్యలు చేపట్టారు.
ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని..
- మొదట 1989 డిసెంబర్ 2న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చౌతాలా 1990 మే 22 వరకు కొనసాగారు.
- రెండోసారి 1990 జూలై 12న సీఎం అయ్యారు. అప్పటి సీఎం బనారసీ దాస్ గుప్తా తొలగింపు తర్వాత ఈ పదవి చేపట్టారు. కానీ, ఐదు రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చింది.
- మూడోసారి 1991 ఏప్రిల్ 22న చౌతాలా సీఎం అయ్యారు. అయితే.. రెండు వారాల తర్వాత కొన్ని కారణాల దృష్ట్యా ఆఆ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది.
- మరోసారి 1999 జూలై, 2000 ఫిబ్రవరిలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆయన పదవీకాలం 2005 మార్చి వరకు కొనసాగింది.
ఇలా ఓం ప్రకాశ్ చౌతాలా తన రాజకీయ జీవితంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ తన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నారు.
సంతాపం తెలిపిన నేతలు
- చౌతాలా (Om Prakash Chautala Death)మరణంపై హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం వ్యక్తం చేశారు.
‘INLD నేత, మాజీ ముఖ్యమంత్రి చౌతాలా జీ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన రాష్ట్రం, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. హర్యానా, దేశ రాజకీయాల్లో ఆయన లోటును పూడ్చడం అసాధ్యం’ అని సీఎం తన సందేశంలో తెలిపారు. - కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతాపం వ్యక్తం చేస్తూ ‘హర్యానా మాజీ సీఎం, సీనియర్ నాయకుడు చౌతాలాజీ మరణించడం బాధాకరం. హర్యానా, దేశ సేవకు ఆయన చేసిన కృషి అపారమైనది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
- హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా సంతాపం వ్యక్తం చేశారు.
‘చౌతాలా జీ సీఎంగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రజలకు సేవ చేశారు. ఆయన ఇంత త్వరగా మనల్ని వదిలిపోతారని అనుకోలేదు’ అన్నారు. - JD(U) నాయకుడు కెసీ త్యాగీ సంతాపం వ్యక్తం చేస్తూ ‘చౌతాలా మరణం లక్షలాది మంది అభిమానులకు అపూర్వ నష్టం. హర్యానా రైతులు ఆయన నేతృత్వం, మార్గదర్శకత్వాన్ని కోల్పోయారు’ అని పేర్కొన్నారు. అని అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..