జమిలి ఎన్నికలు (One Nation One Election) బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee) తొలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాన్ని బీజేపీ (BJP) సభ్యులు సమర్థించగా ప్రతిపక్షాల నేతలు వ్యతిరేకించారు. ఈ క్రమంలో రెండు పక్షాల వాదనలను పార్లమెంటరీ కమిటీ (JPC) రికార్డు చేసింది.
One Nation One Electionపై వాడీవేడి చర్చ
బీజేపీ ఎంపీ, కేంద్ర న్యాయ శాఖ మాజీ సహాయ మంత్రి పి.పి. చౌదరి నేతృత్వంలో 39 మంది సభ్యుల కమిటీ సమావేశమైంది. వీరిలో ప్రాధాన పార్టీల ఎంపీలు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రా, జేడీయూ నుంచి సంజయ్ ఝా, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సంజయ్ సింగ్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కల్యాణ్ బెనర్జీ హాజరయ్యారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అంశంపై వీరి మధ్య వాడీవేడి చర్చ జరిగింది.
దేశహితం కోసమేనని..
మీటింగ్ సందర్భంగా కేంద్ర మంత్రిత్వ న్యాయ శాఖ ప్రతిపాదిత చట్టానికి సంబంధించిన నిబంధనలను ప్రస్తావించింది. లోక్‌సభ (Lok Sabha ), అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించే అంశానికి భారత న్యాయ సంఘం సహా వివిధ సంస్థలు సమర్థించాయని పేర్కొంది. దేశహితం కోసం వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానం ఆశ్యకతను వివరించింది.
వ్యతిరేకించిన ప్రతిపక్షాలు
జమిలి ఎన్నికల (Jamili elections) ఆలోచనను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఈ సమావేశంలో కూడా తమ వాదనను వినిపించాయి. ముఖ్యంగా ఇది రాజ్యాంగ మౌలిక తత్వానికి వ్యతిరేకమని కాంగ్రెస్ పేర్కొంది. ఇది ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధానమని తృణమూల్ కాంగ్రెస్ వాదించింది.
JPCలో 27 లోక్ సభ, 12 రాజ్యసభ సభ్యులు
రాజ్యాంగంలోని కీలకమైన 129వ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు ఇటీవల లోక్‌సభ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి ప్రతిపాదనలను పంపారు. ఈ కమిటీలో పూర్వ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, పర్షోత్తమ్ రూపాలా, మనీష్ తివారితోపాటు అనిల్ బలూని, బంసరి స్వరాజ్, సంబిత్ పాత్ర వంటి నేతలు ఉన్నారు. ఈ కమిటీలో మొత్తం 27 మంది లోక్‌సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
ఎవరేమంటున్నారంటే…
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, ఎన్నికల నిర్వహణ సమర్థత పెరుగుతుందని, శాసనసభల పనితీరు మెరుగుపడుతుందని బీజేపీ ఎంపీలు అంటున్నారు. ఈ విధానాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. దీని వల్ల ప్రజాస్వామ్య సమతుల్యత దెబ్బతింటాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నాయి.
రాజ్యాంగ సవరణ ద్వారా
జమిలి ఎన్నికల ప్రతిపాదన అమలు చేయాలంటే కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరం అవుతాయి.
కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితిని తగ్గించడం లేదా పెంచడం వంటి విషయాలు కీలక అంశాలుగా ఉన్నాయి. ప్రజలు వారి స్థానిక సమస్యలను ప్రత్యేక ఎన్నికల సమయంలో ప్రముఖంగా చూస్తారని, జమిలి ఎన్నికల్లో ఇది తగ్గిపోతుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అయితే.. పార్లమెంటరీ కమిటీ తన నివేదికను అందించిన తర్వాతే ఈ ప్రతిపాదనపై తదుపరి చర్యలు ఉంటాయి. ఈ సమావేశంలో సభ్యుల నిష్కర్ష, చట్టప్రవీణుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ బిల్లులపై నివేదిక రూపొందించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..