One Nation One Election : మోదీ ప్రభుత్వం మరో సంచలనాన్ని సృష్టించబోతోంది. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు కార్యరూపం దాల్చబోతుందని తెలుస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అనే విధానంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష. దీన్ని అమల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం అడుగులు మరింత ముందుకు వేసిందని తెలుస్తోంది. ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర సిద్ధమవుతోందని సమాచారం. ఈ అంశంపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదించింది. పార్లమెంటులో ఈ బిల్లు పాసైతే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.
మద్దతును కూడబెట్టుకునేందుకు..
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతు పొందడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee – JPC)ని సంప్రదించి, దీనిపై విస్తృత చర్చలు జరపాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవడంతోపాటు పలు సూచనలు స్వీకరిస్తారు. అలాగే అసెంబ్లీల స్పీకర్లు, మేధావులు, నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. దీంతోపాటు ఈ అంశంపై ప్రజాభిప్రాయాలను కూడా సేకరించే అవకాశం ఉంది.
One Nation, One Election ఎందుకు?
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బహుళ ప్రయోజనకరమని బీజేపీ సర్కార్ భావిస్తోంది. దీంతో సమయం, డబ్బులు, వనరులను ఆదా చేయొచ్చని అంటోంది. ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అభివృద్ధి పనులకు కలిగే ఆటంకాలను అధిగమించొచ్చని అభిప్రాయపడుతోంది.
మేధావులు, నిపుణులు ఏమంటున్నారు?
ఈ వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే విధాన్ని అమలు చేయడమనేది అంత సులువైన పనికాదని నిపుణులు,మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇది సవాళ్లతో కూడుకున్నదని అంటున్నారు. రాజ్యాంగ సవరణ లేకుండా ఇది సాధ్యం కాదంటున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సమర్థిస్తాయా? అనేది ప్రశ్నార్థకమేనని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశం, ఒక ఎన్నిక విధానాన్ని అమలు చేయాలంటే కనీసం ఆరు బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది. ఇందుకు పార్లమెంటులో 2/3 మెజారిటీ అవసరం. లోక్‌సభ, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ అవసరమైన 2/3 మెజారిటీని సాధించడం కష్టతరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విపక్షాలు ఏమంటున్నాయి?
వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానంపై ప్రతిపక్షాలు విముఖత చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం దీనిపై విమర్శలు గుప్పిస్తోంది. ఒకేసారి ఎన్నికలన్నీ నిర్వహించడం సవాల్‌తో కూడుకున్న పని అని, ఇది అమల్లోకి వస్తే లాజిస్టికల్ సమస్యలు ఎదురవుతాయని అంటోంది. అలాగే ఈ విధానం ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
కోవింద్ కమిటీ ఏమంటోందంటే..
ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం విజయవంతంగా అమల్లోకి రావాలంటే ద్విపక్ష మద్దతు కీలకమని స్వయాన రామ్ నాథ్ కోవింద్ కమిటీ పేర్కొంది. ఈ బిల్లు ఆమోదం పొందినా 2029 తర్వాత మాత్రమే అమలు చేయొచ్చని సూచించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా ఎక్స్(ట్విట్టర్) లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..