Suryapet : ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపడుతున్న ఇథనాల్ ఫ్యాక్టరీపై స్థానికులు నిరసనలు ముమ్మరం చేశారు. కానీ ఇవేవీ పట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్‌లోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు.
Ethanol factory ని మూసివేయండి..
ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్ పరిశ్రమ ఎదుట భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ ఫ్యాక్టరీని నెలకొల్పితే అడ్డుకుంటామని నిరసన కారులు హెచ్చరించారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో దిగివచ్చిన సర్కారు..
ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలోని దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దంటూ అక్కడి స్థానికులు గతంతో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై నవంబర్ 26న రాత్రి ప్రజలు ఆందోళనలను ఉధృతం చేయడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగివచ్చింది. మరో లగచర్ల సంఘటనను తలపించేలా దిలావర్ పూర్ ప్రజలు ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో సర్కరు దిద్దుబాటుచర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దిలావర్ పూర్ ప్రజలతో కలెక్టర్ చర్చలు జరిపగా అవి విఫలమయ్యాయి. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ ప్రజలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావటంతో.. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..