Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy ) కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన , గ్రూప్ -2 పరీక్షలు, మెస్ ఛార్జీలు, కులగణన సామాజిక సర్వే తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు.
ప్రతీ ఐదు వందల మందికి ఒక సర్వేయర్
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రజా పాలనలో ‘వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలనను ఈనెల 31 లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పరిశీలన చేసిన సర్వే వివరాలను వెనువెంటనే మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ ఐదు వందల మందికి ఒక ఉద్యోగి ( సర్వేయర్) ను నియమించుకోవాలని, సర్వేలో ఇందిరమ్మ కమిటీ సభ్యులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్రంలో ఎక్కడైనా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు కాకపోతే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఏ గ్రామంలో సర్వే నిర్వహిస్తారో ఆ ముందు రోజు రాత్రి ఊరిలో చాటింపు చేయాలన్నారు. అంతేగాక స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఏ ఒక్క దరఖాస్తును కూడా విడిచిపెట్టకుండా చిన్న పొరపాట్లకు కూడా తావు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలన్నారు. సర్వే వివరాలపై ప్రతి రోజు కలెక్టర్లు సమీక్షించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఓ నిరంతర ప్రక్రియ ఈ ఏడాది 4.5 లక్షల ఇండ్లను నిర్మించబోతున్నాం’ అని కలెక్టర్లకు మంత్రి సూచించారు.
విద్యార్థులతో సహపంక్తి భోజనం
కాంగ్రెస్ సర్కారు సంవత్సరం లోపే విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు పెంచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాస్టళ్లను తరచూ తనిఖీ చేయాలని, విద్యార్థులకు అందించే సరుకుల నాణ్యతపై దృష్టి సారించాలన్నారు.
ఈనెల 14న మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,ఇతర ప్రజా ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు తమ పరిధిలోని సంక్షేమ హాస్టళ్లను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా పాల్గొనాలని మంత్రి తెలిపారు. మరోవైపు కులగణన, సామాజిక సర్వే రాష్ట్రంలో 1.16 కోట్ల కుటుంబాలకు 1.12 కోట్ల కుటుంబాల సామాజిక సర్వే (99.09 శాతం) పూర్తిచేశామని తెలిపారు. ఈనెల 13వ తేదీ సామాజిక సర్వేకు తుదిగడువు అని మంత్రి చెప్పారు. ఆ తర్వాత ప్రజా పాలన సేవా కేంద్రాల్లో కూడా కుటుంబ సర్వే వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] కేసీఆర్ కారణమని మంత్రి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే […]