ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులపై వెంటనే నిర్ణయం తీసుకోకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాలేజీలు నిరవధికంగా బంద్ (Colleges Bandh ) చేస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు ప్రకటించారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఎటువంటి స్పష్టమైన నిర్ణయం రాలేదని తెలిపారు. మొత్తం రూ.1,200 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పారు. మిగిలిన రూ.900 కోట్లు దీపావళికి ముందు ఇవ్వాలని కోరామని కానీ, ఇప్పటివరకు చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు.
కాగా నవంబర్ 2 లోపు ప్రభుత్వం చెల్లింపులపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించకపోతే, నవంబర్ 3 నుంచి రాష్ట్రంలోని అన్ని వృత్తి విద్యా, ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కాలేజీలు నిరవధిక బంద్‌లోకి వెళ్లనున్నాయి.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ప్రభుత్వంపై ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్‌బాబు విమర్శలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించినా ప్రయోజనం లేదని, ప్రభుత్వం మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. మా మీద విజిలెన్స్ విచారణలు ఆదేశించారని, ఇది తమ ఆందోళనను అణిచివేయడానికి చేస్తున్న ప్రయత్నమని రమేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Colleges Bandh : ఉద్యమాలపై రోడ్‌మ్యాప్ సిద్ధం
- నవంబర్ 3 నుంచి నిరవధిక బంద్ ప్రారంభం.
- నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది, బోధకులతో సర్వసభ్య సమావేశం.
- నవంబర్ 10 లేదా 11న 10 లక్షల విద్యార్థులతో భారీ బహిరంగ సభ.
లంచాల ఆరోపణలు – విచారణకు డిమాండ్
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, రేపటిలోగా మంచి నిర్ణయం తీసుకోవాలని లేదంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొనే అసౌకర్యానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని అన్నారు. కొన్ని కాలేజీలకు మాత్రమే బకాయిలు చెల్లించడం వెనుక లంచాల ప్రభావం ఉందా అనే ప్రశ్నను రమేష్‌బాబు లేవనెత్తారు. “10 శాతం లంచం తీసుకుని కొందరికి మాత్రమే చెల్లింపులు జరిపారా? ఇది స్పష్టంగా బయటకు రావాలని. అక్రమాలు చోటుచేసుకున్న చోట విచారణ జరపాలని, అవసరమైతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు కలిగే ఇబ్బందులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. కానీ ప్రభుత్వం సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమని రమేష్‌బాబు స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








