Protests against Elon Musk : టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk )కు వ్యతిరేకంగా అమెరికా వ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. వివిధ నగరాల్లోని టెస్లా డీలర్‌షిప్ కార్యాలయాల (stores) ఎదుట ఈ రోజు పెద్ద ఎత్తున బహిరంగ ప్రదర్శనలు నిర్వహించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రాజకీయ రంగంలో మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఎలాన్ మస్క్ రాజకీయ జోక్యం
ఎలాన్ మస్క్ ((Elon Musk) కొంతకాలంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఫెడరల్ ఏజెన్సీల (federal agencies)ను పునర్‌వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యతకను కూడా ప్రముఖంగా సూచిస్తున్నారు. ట్రంప్ పరిపాలన విధానాలను అనుసరించేలా మస్క్ అభిప్రాయాలు ఉండటంతో రాజకీయంగా ఆయనపై వ్యతిరేకత పెరిగింది. ఇందులో భాగంగానే ఈ నిసనలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ విధానాల వల్ల ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లుతోందని ఆందోళనకారులు విమర్శిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వానికి మస్క్ మద్దతు ఇవ్వడం వల్ల పరిపాలనలో పారదర్శకత లోపిస్తోందని మండిపడుతున్నారు. తన వ్యాపార ప్రయోజనాల కోసం ఎలాన్ మస్క్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Protests in US : ప్రధాన నగరాల్లో నిరసనలు
న్యూయార్క్, బోస్టన్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా వంటి అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఈ నిరసనలు భారీగా జరుగుతున్నాయి. ప్రజలు టెస్లా కంపెనీ ఉత్పత్తులను బహిష్కరించాలని, స్టాక్ ఇన్వెస్టర్లు తమ వాటాలను అమ్మేయాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని డీలర్షిప్ కార్యాలయాలపై దాడులు కూడా తీవ్రమయ్యాయి. కొలరాడోలో ఒక టెస్లా డీలర్షిప్ కార్యాలయంపై మోలోటోవ్ కాక్‌టెయిల్స్ విసిరిన ఘటనలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడులు రాజకీయ వ్యతిరేకత నేపథ్యంలో జరిగాయని అధికారులు భావిస్తున్నారు.
Protests : పడిపోయిన టెస్లా షేర్లు
ఈ నిరసనలతో టెస్లా స్టాక్ మార్కెట్‌లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టెస్లా షేర్లు గణనీయంగా పడిపోయాయి. అయినప్పటికీ ఎలాన్ మస్క్ సంపద ఇంకా అధికంగానే ఉంది. ప్రస్తుతం ఆయన సంపద $359 బిలియన్‌గా ఉన్నట్లు అంచనా.
స్పందించని ఎలాన్ మస్క్
ఈ నిరసనలు ఒక్క అమెరికాలోనే కాకుండా ఇంగ్లాండ్, స్పెయిన్, పోర్చుగల్ వంటి ఇతర దేశాల్లో కూడా జరుగుతున్నాయి. మస్క్ రాజకీయ సంబంధాలు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతుండటంతో ఇవి మరింత ఉధృతమయ్యాయి. ఈ నిరసనలపై ఎలాన్ మస్క్ స్పందించలేదు. ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆయన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే వ్యక్తి అయినప్పటికీ ఈ నిరసనలపై ఇప్పటివరకు ఆయన స్పందించలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..