Punjab Bandh LIVE : పంటలకు మద్దతు ధరను కల్పిస్తూ దాన్ని చట్టబద్ధత చేయాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు తమ నిరసనను మరోరూపంలో వ్యక్తపరిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.
వ్యాపార వర్గాల మద్దతు
పంజాబ్ రైతుల బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను మూసివేశారు. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్రమే సేవలను వినియోగించుకొనేలా వెసలుబాటు కల్పించామన్నారు.
కలిసి వచ్చిన కార్మికులు, ఉద్యోగులు
గత వారమే సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర) , కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) ఈ బంద్ (Punjab Bandh)కు పిలుపునివ్వగా దానిని పకడ్బందీగా చేపట్టారు. రెండు వేదికల సమన్వయకర్త సర్వాన్ సింగ్ పాంధెర్ మీడియాతో మాట్లాడుతూ వ్యాపారులు, రవాణా కార్మికులు, ఉద్యోగ సంఘాలు, టోల్ ప్లాజా కార్మికులు, కూలీలు, మాజీ సైనికులు, సర్పంచ్‌లు, ఉపాధ్యాయ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయని వివరించారు.
సరిహద్దులో శిబిరం
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 13 నుంచి రైతులు పంజాబ్-హరియాణా సరిహద్దుల వద్ద శంభూ, ఖనౌరిలో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లే ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న జగ్జిత్ సింగ్ డల్లేవాల్ నిరవధిక నిరాహార దీక్షను చేపట్టగా, అది ఆదివారం నాటికి 34వ రోజుకు చేరుకుంది. తాము గాంధీయ మార్గాన్ని అనుసరిస్తూ నిరసన కొనసాగిస్తున్నామని, ప్రభుత్వం తమపై శక్తిని ప్రయోగిస్తే అది దాని తప్పిదమే అవుతుందని రైతులు అంటున్నారు.
రైతుల డిమాండ్లు ఇవే..
- పంటల కనీస మద్దతు ధర (MSP)కు చట్టబద్ధత కల్పించాలి
- వ్యవసాయ రుణమాఫీ చేయాలి.
- రైతులకు, కౌలు కూలీలకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- విద్యుత్ చార్జీల పెంచొద్దు
- పోలీసులు తమపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి
- 2021లో లఖింపూర్ ఖేరి హింస బాధితులకు న్యాయం చేయాలి
- భూసేకరణ చట్టం-2013ను పునరుద్ధరించాలి
- 2020-21 ఆందోళన సమయంలో మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలి
రైతులు తమ ఈ డిమాండ్లను కేంద్రాన్ని ఒప్పించేందుకు చేస్తున్న ఆందోళనలో భాగంగానే పంజాబ్ బంద్ జరిగింది. ఈ నిర్ణయం తమ హక్కులను కాపాడుకోవడానికి దోహదపడుతుందని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..