వరంగల్ : తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 13 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు (Holidays) ప్రకటించింది. అందులో నల్లగొండ, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయకు రాకూడదని అధికారులు సూచించారు. వర్ష ప్రభావం కారణంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు ఆగస్ట్ 29, 30 వరకు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. భారీ వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సెలవులను మరో రెండు రోజులు పొడిగించింది. అందువల్ల పాఠశాలలు, కళాశాలలు బంద్ కానున్నాయి.సిద్దిపేట జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
కేయూలో పరీక్షలు వాయిదా..
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రాజేందర్ ప్రకటించారు. వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
శాతవాహన యూనివర్సిటీలో..
కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. వర్షాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయని స్పష్టంచేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మోడల్ స్కూల్స్‌లో ఖాలీగా ఉన్న సీట్ల భర్తీ కోసం స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరానికి ఆరు నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించినా, ఇంకా సుమారు 48,630 సీట్లు ఖాలీగా ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








