Bhadrachalam | దక్షిణ అయోధ్యగా గుర్తింపు పొందిన భద్రాద్రి(Bhadradri)లో శ్రీరామనవమి (Ram Navami) వేడుకలకు సర్వం సిద్దం అయ్యింది. ఆదివారం రాములవారి కల్యాణోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాముల వారి ఆలయంలో వసంత పక్ష ప్రయుక్త శ్రీ రామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గరుడ ధ్వజ పటావిష్కరణ, అనంతరం గరుడ ధ్వజాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన వస్త్రంపై ధ్వజ పటాన్ని లిఖిస్తారు. దానికి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీతాయారు అమ్మ కోవెలలో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా రక్షగా ఉండాలని కోరుతూ గరుత్మంతుడి పటాన్ని ధ్వజ స్తంభంపై ఎగురవేస్తారు. శుక్రవారం అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 5న ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది. 6న నవమి రోజున తిరుకల్యాణం, పునర్వసు దీక్ష ప్రారంభం తదితర కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఏప్రిల్ 7న మహాపట్టాభిషేకం, 12న చక్రతీర్థం, శ్రీపుష్పయాగంతో ఉత్సవ సమాప్తి కానుంది.
Ram Navami : శ్రీరామనవమి వేడుకలకు భారీ ఏర్పాట్లు
శ్రీరామనవమి, మహాపట్టాభిషేక మహోత్సవాలకు గవర్నర్, సీఎంలను ఆహ్వానిస్తూ అధికారులు రాజ పత్రాలను అందించారు. కాగా శ్రీ రామ నవమి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రాచలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇకపోతే ఏటా ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. సిఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరై ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మంత్రులు తుమ్మల, పొంగులేటి, కొండా సురేఖ తదితరులు హాజరు కానున్నారు.
యావత్ భారతదేశంతో పాటు తెలుగురాష్ట్రల్లో నవమి వేడుకలు అంబరాన్ని తాకుతాయి. ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం… శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగనున్నాయి. తెలంగాణలో భద్రాచలం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఒంటిమిట్ట ఆలయాల్లో జరిగే శ్రీరామచంద్రుడి బ్రహ్మోత్సవాలకు అంతా సిద్దమైంది. పవిత్ర గోదావరి నదితీరంలోని భద్రాద్రిలో వెలసిన సీతారామస్వామి ఆలయం దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విలసిల్లుతోంది.
తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానం (Bhadrachalam Temple )లో ధ్వజారోహణం నేత్రపర్వంగా నిర్వహించారు. పౌర్ణమి నాటి వరకు నిర్వహించే ఈ బ్రహ్మో త్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవులకు తెలిపే విధంగా ఈ ధ్వజారోహణ చేపడతారు. అలాగే అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, దేవతలకు ఆహ్వానించే బేరి పూజను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్వామి వారి జన్మదినం రోజైన శ్రీరామనవమి రోజు కల్యాణం నిర్వహించనున్నారు. రామయ్య కల్యాణం, మహాపట్టాభిషేకం కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా భక్తులు వీక్షించేలా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.