గణతంత్ర దినోత్సవం (Republic Day) దేశవ్యాప్తంగా ఈ రోజు ఘనంగా జరిగింది. న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్ (kartavya path) వేదికగా నిర్వహించిన ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తోపాటు ఇతర కేంద్ర మంత్రులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Prabowo Subianto) హాజరయ్యారు. సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి ముర్ము దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోని ప్రగతి, శక్తిసామర్థ్యాలు, సమానత్వం యావత్ ప్రపంచానికే ఆదర్శమని ఆమె అన్నారు. రాష్ట్రపతి ముర్ము, సుబియాంటో సంప్రదాయ బగ్గీలో వస్తూ ఈ పరేడ్‌లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Republic Day : పరేడ్.. ప్రత్యేకతలు
కర్తవ్య పథంలో జరిగిన పరేడ్ భారతదేశ వైభవాన్ని ప్రతిబించింది. ఉదయం 10.30 విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై కర్తవ్య పథ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలను ఇందులో ప్రదర్శించారు. 300 మంది సాంస్కృతిక కళాకారులు ‘సారే జహాన్ సే అచ్ఛా గీతాన్ని ఆలపించారు. పరేడ్‌లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక రాకెట్ సిస్టమ్స్ వంటి ఆయుధాలను ప్రదర్శించారు. మహాకుంభా ప్రాముఖ్యతను తెలియజేసే శకటం విశేషంగా ఆకట్టుకుంది.
‘శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ ఉట్టిపడేలా..
కర్తవ్య పథంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ‘జాయింట్ ఆపరేషన్స్ రూమ్’ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ‘శశక్త్ ఔర్ సురక్షిత్ భారత్’ అనే థీమ్‌తో దేశం సైనిక బలగాల మధ్య సమన్వయాన్నితెలిపిలా దీనిని రూపొందించారు. ఈ రూమ్ భవిష్యత్తులో భారతదేశం సైనిక సామర్థ్యాలను మరింత పెంచే ఉద్దేశంతో రూపొందించబడింది. ఇది త్రివిధ దళాల మధ్య మెలిమెటి, సమన్వయం సాంకేతిక ప్రగతిని ప్రదర్శించింది.
దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
గణతంత్ర వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. దేశప్రజలకు ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించిన మహానుభావులకు వందనాలంటూ Xలో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యం, ఔన్నత్యం, ఐక్యత పునాదులపై మన ప్రస్థానం సాగుతోందని అన్నారు. మన రాజ్యాంగ ఆదర్శాలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణలో వేడుకలు
Republic Day Celebrations in Telangana తెలంగాణలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ (Jishnu Dev Varma) జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఈ సందర్భంగా అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి జూబిలీహిల్స్‌లోని తన నివాసంలో జాతీయజెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అసెంబ్లీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి సీతక్క ములుగులోని తన క్యాంపు ఆఫీసులో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
Republic Day Celebrations in AP ఆంధ్రప్రదేశ్‌లోని విజవాడలో జాతీయ జెండాను గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ (Syed Abdul Nazeer) ఆవిష్కరించారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు (N. Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ హాజరయ్యారు. ఏపీ సచివాలయంలో జరిగిన వేడుకల్లో చీఫ్ సెక్రటరీ విజయానంద్ సైనికుల గౌరవ వందనం స్వీకరించి జాతీయజెండాను ఆవిష్కరించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలో ఏపీ హోంమంత్రి అనిత జాతీయ జెండాను ఎగురవేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








