Dubai News : అతడు చిరు ఉద్యోగి.. చిన్నపాటి ప్రైవేటు కొలువు. అష్టకష్టాలు పడి భార్యా పిల్లలను పోషించుకుంటున్న వేతన జీవి. అందరిలాగే తనకూ ఓ సొంతిల్లు ఉండాలని ఆశించాడు. అందుకు అప్పు చేశాడు.. ఆ తర్వాత తీర్చలేకపోయాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తే బాగా పైసలు వస్తాయని, దీంతో కష్టాలు తీరుతాయని ఎవరో చెప్పడంతో అక్కడికి బయల్దేరాడు. ముంబై దాకా వెళ్లి భార్యా పిల్లలతో మాట్లాడాడు.. ఆ తర్వాత అతడి ఫోన్ ఎంతకీ కలవలేదు. ఎన్నిసార్లు కలిపినా స్విచ్చాఫ్ అనే వస్తోంది.
రూ. 13 లక్షల అప్పు కావడంతో..
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన 39 సంవత్సరాల తంబాకు శ్రీనివాస్‌ది నిరుపేద కుటుంబం. చిన్నపాటి ప్రైవేటు కొలువు చేసి భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఇదే క్రమంలో అతడు సొంతిల్లు కట్టుకున్నాడు. ఇందుకు రూ. 13 లక్షల అప్పు అయ్యింది. చిన్నపాటి జీతంతో అవి తీర్చడం శ్రీనివాస్‌కు కష్టతరమైంది.
బాగా సంపాదించాలనే ఆశతో Dubai కి పయనం..
అప్పులు తీర్చే మార్గాన్ని అన్వేషిస్తున్న క్రమంలో అతడికి ఎవరో దుబాయిలో ఉద్యోగాలు ఉంటాయని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌లో ఆశలు రేకెత్తాయి. ఎలాగైనా అక్కడికి వెళ్లి బాగా పైసలు సంపాదించి అప్పులన్నీ తీర్చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బొడ్డు సాయి అనే సబ్ ఏజెంట్‌ను సంప్రదించాడు.
దుబాయికి టికెట్ బుక్కయి..
దుబాయికి వెళ్లడానికి వీసా కోసం శ్రీనివాస్‌ను హైదరాబాద్‌లోని సమ ట్రావెల్స్ వద్దకు సాయి తీసుకెళ్లాడు. దుబాయిలో హెల్పర్‌గా పనిచేయడానికి ఉద్యోగం ఉందని సమ ట్రావెల్స్ నిర్వాహకులు చెప్పడంతో వీసా, ఇతర ప్రక్రియ నిమిత్తం ఆ సంస్థకు శ్రీనివాస్ రూ. 75 వేలు చెల్లించాడు. ఈ క్రమంలో సమ ట్రావెల్స్ ద్వారా అతడికి 2023 ఆగస్టు 5న టికెట్ బుక్ అయ్యింది. దుబాయికి వెళ్లేందుకు విమానం ఎక్కడానికి ఆగస్టు 3న ఇంటి నుంచి బయల్దేరిన శ్రీనివాస్ ఆర్మూర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబై బస్సు ఎక్కాడు. ఆగస్టు 4న ముంబై చేరుకున్నాడు. ఈ విషయం అతడు తన భార్య లక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత అతడి ఫోన్ రాలేదు. ఇక్కడి నుంచి భార్య చేసినా కలవలేదు.
ఎక్కడ వెతికినా ఫలితం శూన్యం
శ్రీనివాస్ ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పలుమార్లు ఏజెంట్‌ను సంప్రదించారు. అయినా నో రెస్పాన్స్. శ్రీనివాస్ ఎక్కడున్నాడో సమాధానం రాలేదు. ముంబైకి వెళ్లి వాకబు చేసినా సమ ట్రావెల్స్ నిర్వాహకులు పట్టించుకోలేదు. దీంతో శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు ముంబై వీధుల్లో వెతకడం మొదలెట్టారు. అయినా ఫలితం దక్కలేదు. అంత పెద్ద నగరంలో ఓ వ్యక్తి ఆచూకీ దొరకడం సాధ్యం కాక శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ముంబైలోని సారంగపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మైగ్రెంట్ లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపాండ్లను కలిశారు. ఆయన ద్వారా నిర్మల్ కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నాలుగు నెలలుగా శ్రీనివాస్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అతడి భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..