Shantanu Deshpande comments on food Delivery : భారతదేశంలో ఫుడ్ డెలవరీ కంపెనీలు, వాటికి అలవాటు పడిన వినియోగదారులపై బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో శాంతాను దేశ్‌పాండే సంచలన కామెంట్స్ చేశారు. త్వరిత ఆహార సరఫరా (క్విక్ డెలివరీ) అనేది ఆరోగ్యాన్ని దెబ్బతీసే చర్య అని అభివర్ణించారు. ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం భారత్‌లో పెరుగుతోందని, దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. లింక్డ్‌ఇన్‌లో తన అభిప్రాయాలను ఆయన ఇలా వ్యక్తపరిచారు.
పోషకాహారాన్ని మరచిపోయామని ఆవేదన
ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాల వినియోగం వల్ల ఆరోగ్యపరమైన పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నామని శాంతాను అన్నారు. ఇవి ఎక్కువగా పామాయిల్, చక్కెరతో నిండి ఉంటాయని తెలిపారు. మనం ఆహార దిగుబడికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నామని, పోషక విలువలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇది 50 ఏళ్లగా క్రమంగా జరుగుతోందని, మన ఆహారంలో పోషక విలువలు ఉండటం లేదని వ్యాఖ్యానించారు.
food Delivery లో క్విక్ విధానం అనర్థదాయకం
ఆహార సరఫరా (food Delivery) రంగంలో కుక్ టైమ్ 2 నిమిషాలు, డెలివరీ టైమ్ 8 నిమిషాలు అనే ట్రెండ్ గురించి శాంతానను మాట్లాడుతూ ఇది ఎంత ప్రమాదకరమో వివరించారు. ఇది ఒక ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకుడి మాటల్లో విన్నప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని తెలిపారు. చైనా, అమెరికా లాంటి దేశాలు చేసిన తప్పులను మనమూ చేస్తున్నామని శాంతాను అంటున్నారు. రూ.49 పిజ్జాలు, రూ.20 ఎనర్జీ డ్రింక్స్, రూ.30 బర్గర్ల వంటి ఆహారాలతో జంక్ ఫుడ్‌పై మనకు ఆసక్తి పెరగడం బాధాకరమన్నారు. ఫ్రోజన్ ప్యూరీలు, పాత కూరగాయలతో తయారైన పదార్థాలు వేడి చేసి పంపిణీ చేసే అలవాటు దేశవ్యాప్తంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఆహార సరఫరా రంగంలో పెట్టుబడిదారులు ఈ ట్రెండ్‌ను ఒక వ్యాపార మోడల్‌గా మార్చే ప్రయత్నంలో ఉన్నారని విమర్శించారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో వంటి కంపెనీలను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేశారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రాసెస్డ్ ఆహారాల వినియోగాన్ని ప్రజలు తగ్గించే ప్రయత్నం చేయాలని సూచించారు.
వంట నేర్చుకోవాలి
వంట చేయడం ఒక నైపుణ్యమని, ఇది ప్రతి ఒక్కరికీ అవసరమని శాంతాను పేర్కొన్నారు. మిమ్మల్ని మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో కాపాడుకోవడానికి రోజుకు 10 నిమిషాల సమయం కేటాయించడం చాలా అవసరమని సూచించారు. తరచూ ప్రాసెస్డ్ ఆహారాన్ని వినియోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావచ్చని హెచ్చరించారు. అందుకే ప్రజలు ఇంట్లో వంట చేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు జీవనశైలిని అవలంబించాన్నారు.
మన వ్యవస్థపై సోషల్ మీడియా వేదికగా శాంతాను దేశ్‌పాండే ఎప్పుడూ ప్రశ్నలు లేవలెత్తుంటారు. ఇవి భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఫుడ్ డెలవరీ కంపెనీలు, వాటికి అలవాటు పడిన వినియోగదారులపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారి తీశాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    