Sircilla Kidnap Case : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ సిరిసిల్ల (Sircilla) జిల్లాలో కలకలం రేపింది. వేములవాడ రాజన్న సన్నధిలో డిసెంబరు 23న ఓ పాప కిడ్నాప్‌నకు గురికాగా పోలీసులు ఎంతో శ్రమకోర్చి కాపాడారు. నిందితులైన ముగ్గురు మహిళలను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ ఈ రోజు మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..
జగిత్యాల జిల్లా కోడిమియాల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగరాపు మధు, లాస్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాస్య మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల ఆమె తన భర్తతో వేరుగా ఉంటోంది. ఇటీవల తన పిల్లలతో కలిసి వేములవాడ (Vemulawada)లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Sri Rajarajeshwara Swamy temple) లాస్య వెళ్లింది.
పరిచయమైన మహబూబ్‌నగర్ మహిళలు
లాస్య వేములవాడలో ఉండగా మహబూబాబాద్ (Mahabubabad)కు చెందిన శ్రీరామోజి వెంకట నర్సమ్మ, గంజిరపు అంజవ్వ, కునపూరి ఉప్పమ్మ కూడా ఆ ఆలయానికి వచ్చారు. వీరికి లాస్యతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో లాస్య, ఆమె పిల్లలతో కలిసి ఆ మహిళలు వేములవాడ గుడిలోనే ఐదు రోజులు బస చేశారు.
కలిసి ఉన్నట్టే ఉండి కిడ్నాప్
లాస్య మానసిక స్థితిని గమనించిన ఆ మహిళలు ఆమె నాలుగేళ్ల కూతురు ఆదిత్యను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశారు. డిసెంబరు 23న చిన్నారిని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయాన్ని లాస్య చాలా సేపటి తర్వాత గుర్తించింది. చుట్టుపక్కల వెతికినా ఆ చిన్నారి ఆచూకీ లభించలేదు.
పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
చిన్నారి ఆదిత్య కిడ్నాప్‌నకు గురైందని ఆలస్యంగా తెలుసుకున్న ఆమె మేనమామ గంగస్వామి హుటాహుటిన వేములవాడకు వచ్చి వెతికాడు. ఆచూకీ లభించకపోవడంతో వేములవాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తీవ్ర ప్రయత్నాల తర్వాత..
చిన్నారి కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. లాస్య నుంచి ఎలాంటి సమాచారం పొందలేకపోవడంతో కేసు జటిలంగా మారింది. ఎస్పీ అఖిల్ మహజన్ (Superintendent of Police Akhil Mahajan ) ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి ఆచూకీని కనుగొనేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వేములవాడ ఆలయం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, కొదాడ వంటి ప్రాంతాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి చివరకు పోలీసులు ఎట్టకేలకు నిందితుల వివరాలను రాబట్ట గలిగారు. ముగ్గురు మహిళలను అరెస్టు చేసి చిన్నారి లాస్యను వారి చెర నుంచి రక్షించారు.
పోలీసు సిబ్బందిని అభినందించిన ఎస్పీ
చిన్నారి ఆదిత్య కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహజన్ అభినందించారు. తమ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బాలికను కాపాడారని కొనియాడారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








