Stock market : స్టాక్ మార్కెట్ ఎల్లప్పుడూ ఒడిదొడుకులతోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక వృద్ధిపరంగా పరిశీలిస్తే భారతీయ పెట్టుబడిదారుల (investors) కు ఇది చాలా కీలక సమయం అని ఉంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ (Stock market) అస్థిరతను లాభదాయక అవకాశంగా ఉపయోగించుకోవచ్చని సూచిస్తున్నారు. ఆర్థిక వృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత మార్కెట్ అమ్మకాలు తాత్కాలికమేనని అంటున్నారు.
స్థిరమైన కంపెనీల్లో పెట్టుబడులతో మంచి రాబడి
భారత మార్కెట్ (Stock market) ప్రస్తుతం కొంతవరకు అస్థిరంగా కనిపిస్తున్నా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు మంచి అవకాశాలున్నాయి. మార్కెట్ పతనం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడం కష్టమే. అయితే.. గత అనుభవాలను పరిశీలిస్తే, ప్రతి తక్కువ స్థాయిలోకి వచ్చిన మార్కెట్ మళ్లీ పెరిగిన రికార్డులూ ఉన్నాయి. త్వరలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మరింతగా అమల్లోకి వస్తే, మార్కెట్ మరింత బలపడే అవకాశముంది. ప్రస్తుత మార్కెట్ అస్థిరతను పక్కన పెట్టి, దీర్ఘకాలిక పెట్టుబడులు (investments), పరిశ్రమల ప్రగతిని అంచనా వేయడం ద్వారా పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. పెట్టుబడిదారులు మార్కెట్ ఒడిదొడుకులను భయపడకుండా, స్థిరమైన కంపెనీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి రాబడిని పొందే వీలుందని సూచిస్తున్నారు. బలమైన ఆర్థిక విధానాలు, వడ్డీ రేట్ల తగ్గింపు, ప్రభుత్వ పెట్టుబడులు, సేవల ఎగుమతులు ఇవన్నీ భారత మార్కెట్‌ను బలపరిచే అవకాశమున్నాయని అంచనా వేస్తున్నారు.
Stock market : భారత ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉంది. ముఖ్యంగా దేశీయ వినియోగం పెరగడం, ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేట్ రంగంలో మౌలిక సౌకర్యాల పెట్టుబడులు దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతున్నాయని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం 4.31% వద్ద ఉంది. ఇది నియంత్రణలో ఉంది. సాధారణంగా తక్కువ ద్రవ్యోల్బణం వినియోగదారుల ఖర్చులను పెంచుతుంది. ఇది ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త పన్ను విధానాలు వినియోగాన్ని పెంచేలా ఉండటం ద్వారా మార్కెట్‌కి మద్దతునిచ్చే అవకాశముంది.
తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే పెట్టుబడులకు ఊతం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించడం, రుణాలు తీసుకోవడానికి మరింత అనువుగా మారడం ద్వారా వ్యాపార పెట్టుబడులకు, వినియోగానికి ఊతమిచ్చే అవకాశం ఉంది. ఇటీవలే జరిగిన మార్కెట్ అమ్మకాలతో విదేశీ పెట్టుబడిదారులు మార్కెట్ నుంచి బయటకు వెళ్లినా దేశీయ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్‌ను బలపరుస్తున్నారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు 6.5%గా అంచనా వేయబడింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కొంత తక్కువే అయినా దేశం స్థిరంగా ఎదుగుతోంది. ముఖ్యంగా 2023-24 సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి 8.2% గా నమోదైంది. ఇది గత 12 ఏళ్లలో అత్యధికం.
పెరిగిన పంటల ఉత్పత్తి, మెరుగుపడ్డ తయారీ రంగం
ఖరీఫ్ పంటల ఉత్పత్తి మెరుగుపడటంతో గ్రామీణ వినియోగం పెరిగే అవకాశం ఉంది. తయారీ రంగం కూడా క్రమంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా ఆటోమొబైల్, టెక్నాలజీ, ఔషధ పరిశ్రమల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. భారత సేవా రంగం, ముఖ్యంగా ఐటీ, టెలికాం, బ్యాంకింగ్ రంగాలు బలంగా కొనసాగుతున్నాయి.
Stock market : అనువైన అంశాలు
దేశీయ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లు మరింత స్థిరంగా మారే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడిదారుల విక్రయ ఒత్తిడి తాత్కాలికమే కావచ్చు. అయితే.. మార్కెట్ అనిశ్చితిపై అతిగా భయపడకుండా, దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యమివ్వాలి. బ్యాంకుల లాభాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రుణాల వృద్ధి, బ్యాడ్ లోన్స్ తగ్గుతున్నాయి. భారత ఐటీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రస్థానం ఏర్పరచుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతో ఆటోమొబైల్ రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. భారత్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో ప్రపంచంలోనే కీలక భూమిక పోషిస్తోంది. ఇన్వెస్టర్లు ఈ రంగాలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే అనుకూలంగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు పెరగడం, ఉపాధిని సృష్టించడమే కాకుండా మొత్తం ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. భారతదేశం అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ముందంజలో ఉంది. వినియోగదారుల ఖర్చు పెరగడం ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..