Kodangal : ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల వంటి రుచిపచీ లేని సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అలాగే గుడ్డు (Egg), అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈమేరకు గురువారం పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన (Students Protest) తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను వెంటనే మార్చాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్ ..
మధ్యాహ్న భోజనం పథకం (Mid day Meals scheme) అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చేస్తున్న నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గురువారం ఉడకని అన్నం.. నీళ్ల సాంబారు పెట్టిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే మధ్యాహ్న భోజన పథకం బాగోలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసే దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నియోజకవర్గం (Kodangal ) లోనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తే ఇక రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉందో ఊహించవచ్చని హరీశ్‌రావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పనితీరు దారుణంగా ఉందని హరీష్ రావు విమర్శించారు.
Kodangal : పాఠశాలల్లో నాసిరకంగా మధ్యాహ్న భోజనం
కాగా, నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం ప్రైమరీ స్కూల్ లో సుమారు 40 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టే భోజనం నాణ్యతపై కొంతకాలంగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సరిగా ఉడకని అన్నం, నీళ్ల సాంబారు పెడుతున్నారు. గుడ్డు, అరటి పండు అయితే నెలకోసారి మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అన్నం ఒక్కసారి మాత్రమే వడ్డిస్తున్నారని, ఈ విషయాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని చెబుతున్నారు. భోజన నాణ్యత బాగాలేకపోవడంతో కొందరు ది విద్యార్థులు ఇంటికెళ్లి భోజనం చేస్తుంటే.. మరికొందరు టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








