Micro Finance loan : అప్పు ఆ కుటుంబానికి ముప్పు తెచ్చి పెట్టింది. రుణం ఇచ్చిన సంస్థ దారుణానికి ఆ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోయింది. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు భార్యాభర్తలు బలి అయ్యారు. బలవన్మరణం చేసుకొని పిల్లలను అనాథలు చేశారు. పది రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వారం వారం చెల్లింపులతో కష్టాలు
భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామానికి చెందిన బానోత్ దేవందర్ (37), చందన (32) అదే గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. చాలీచాలని దినసరి వేతనంతో వీరికి కుటుంబ పోషణ భారమైంది. దీంతో మైక్రో ఫైనాన్స్‌లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పుకు వారం వారం కిస్తీలు కట్టాల్సి ఉండగా, కొన్ని రోజుల తర్వాత చెల్లింపులు వీరికి కష్టతరమైంది.
ఒకరి తర్వాత ఒకరు
అప్పు ఇచ్చిన మైక్రో ఫైనాన్స్ (Micro Finance loan) నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడంతో చందన తీవ్ర మనస్తానికి గురైంది. డిసెంబరు 6న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. భార్య చికిత్స పొందుతుండగానే భర్త దేవేందర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో డిసెంబరు 20న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స పొందుతున్న చందన డిసెంబరు 31న మృతి చెందింది. తన కూతురు ఆర్థిక ఇబ్బందులలో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే.. చందన, ఆమె భర్త ఆత్మహత్యకు మైక్రో ఫైనాన్స్ వేధింపులే కారణమని గ్రామస్థులు పలువురు ఆరోపిస్తున్నారు.
అనాథగా మారిన ఇద్దరు పిల్లలు
దేవందర్, చందన దంపతులకు ఆరు, తొమ్మిదేళ్ల వయసు ఉన్న ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో వారు అనాథలయ్యారు. శిథిలమైన ఇల్లు తప్ప ఈ పిల్లలకు ఎలాంటి ఆసరా లేదని, వీరిని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని గ్రామస్థులు, బంధువులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..