Supreme court : తెలంగాణ స్పీకర్ (Telangana Assembly Speaker) తీరుపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి కాంగ్రెస్ (ruling Congress)లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై (BRS MLAs’ disqualification) నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ కేసు ఇవాళ విచారణకు వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం స్పీకర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును వచ్చే బుధవారం విచారణకు వాయిదా వేసింది.
హైకోర్టు ఆదేశాలు బేఖాతరు : బీఆర్ఎస్ తరఫు న్యాయవాది
బీఆర్‌ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy) తరఫున సీనియర్ అడ్వకేట్ ఆర్యమా సుందరం వాదిస్తూ 2024 సెప్టెంబరులో స్పీకర్‌ను నాలుగు వారాల్లో విచారణ షెడ్యూల్‌ను నిర్ణయించమని హైకోర్టు ఆదేశించినప్పటికీ జనవరి వరకు ఎలాంటి నోటీసులు జారీ కాలేదని తెలిపారు. ముఖ్యంగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, అయినప్పటికీ ఇప్పటికీ ఎమ్మెల్యేగా (MLA position) కొనసాగుతూనే ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
సుప్రీం నోటీసులు ఇచ్చినా నో రెస్పాన్స్
సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యల అనంతరం స్పీకర్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న నోటీసులు జారీ చేసింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలందరికీ సమాధానం ఇవ్వడానికి మూడు వారాల గడువు ఇచ్చింది. అయితే, ఆ గడువు పూర్తయినప్పటికీ అనర్హత పిటిషన్లపై ఎలాంటి స్పష్టత రాలేదని మరో సీనియర్ అడ్వకేట్ డి శేషాద్రి నాయుడు కోర్టుకు వివరించారు.
స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు: Supreme court
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయి (Justices BR Gavai), ఏజీ మసీహ్ (Justices AG Masih)లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఇప్పటివరకు మొదటి అభ్యర్థన దాఖలయినప్పటి నుంచి ఎంత సమయం గడిచింది? ఇది దాదాపు సంవత్సరం అవుతోంది. స్పీకర్ కార్యాలయం ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి గడువు ఎందుకు నిర్దేశించలేదు?’ అని న్యాయమూర్తి గవాయి ప్రశ్నించారు. తరచుగా సమయం కోరుతూ తీర్పును ఆలస్యం చేయొద్దని హెచ్చరించారు. ‘ఈ కోర్టులో ఆలస్యం చేసే వ్యూహాలు పాటించకండి’ అని స్పష్టం చేశారు.
స్పీకర్‌ను ఒక నిర్దిష్ట గడువులోపు చర్య తీసుకోవడానికి కోర్టు ఆదేశించగలదా? అనే ప్రశ్నపై కూడా ధర్మాసనం చర్చించింది. దీనికి స్పందించిన సీనియర్ న్యాయవాది సుందరం ‘రాజ్యాంగం అందరికీ వర్తిస్తుంది. దాని ఆదేశాలను అమలు చేయడం కోర్టుల బాధ్యత’ అని తెలిపారు.








