Telangana Assembly | హైదరాబాద్ : రాష్ట్ర శాసన సభ, మండలి సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటనపై సభ్యులు మాట్లాడిన తర్వాత సభను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు.
అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. అక్రమ అరెస్టులపై మండిపడ్డారు. అదానీ – రేవంత్ దోస్తానాపై ప్రశ్నిస్తామనే భయంతోనే తమను అడ్డుకుంటున్నారని, సభలోని రానివ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
కాగా రాష్ట్ర సచివాలయంలో రీడిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. కొత్త డిజైన్ పై తెలంగాణ శాసనసభలో సోమవారం వాడివేడి చర్చలు జరిగాయి .బిఆర్ఎస్ (BRS) హయాంలో గత విగ్రహానికి అధికారిక ఆమోదం లభించలేదని ప్రభుత్వం పేర్కొంది, ప్రస్తుత ప్రభుత్వం డిజైన్‌ను అధికారికంగా చేపట్టినట్లు తెలిపారు. కొత్త డిజైన్ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తోందని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.
బిజెపి విమర్శలు
డిజైన్‌ను ఖరారు చేసే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా రాజకీయ పార్టీలను సంప్రదించలేదని బీజేపీ విమర్శించింది. బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్ బాబులు విగ్రహం నుంచి సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మను తొలగించడంపై విమర్శలు వ్యక్తం చేశారు. విగ్రహంలో బతుకమ్మను చేర్చాలని కోరారు.
ప్రతిపక్షాలను సంప్రదించకుండా విగ్రహాన్ని రీడిజైన్ చేయడంపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. తెలంగాణ తల్లి రూపకల్పనకు ముందు బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) ప్రభుత్వం ఇతర రాజకీయ పార్టీలను, ముఖ్యంగా సీపీఐని కూడా సంప్రదించలేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా ప్రభుత్వ చర్యను సమర్థించారు, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారిక డిజైన్‌ను ఆమోదించడంలో విఫలమైందని వాదించారు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి డిజైన్‌ను అధికారికంగా ఆమోదించిందని, ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ సంక్షిప్త పేరును టీఎస్ నుంచి టీజీగా మార్చిందని వారు చెప్పారు.