- లారీలు పెట్టింది లేదు.. ధాన్యం తరలించేది అస్సలు ఉండదు..
- కొన్నేళ్ళుగా ప్రభుత్వాన్ని మోసం చేసిన ధాన్యం రవాణా కాంట్రాక్టర్లు
- కాంట్రాక్టర్ లకు క్వింటాలు కు ప్రభుత్వం ఇచ్చేది 32 రూపాయలు రైతుకు కాంట్రాక్టర్ చెల్లించేది గరిష్టంగా 15 రూపాయలు
- అంతా తెలిసినా కాంట్రాక్టర్ లకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పౌరసరఫరాల శాఖ అధికారులకే తెలియాలి.
Telangana Civil Supplies Department | పౌరసరఫరాల శాఖలో రవాణా పేరుతో కొన్ని సంవత్సరాలుగా భారీ అవినీతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం రవాణా చేసేందుకు టెండర్ లు దక్కించుకుంటున్న సదరు కాంట్రాక్టర్ లు ఇప్పటికే కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు తెలిసింది.కొందరు కాంట్రాక్టర్ లు అయితే లారీలు పెట్టకుండానే ధాన్యం తరలించినట్లు రికార్డులు చూపి కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము కొట్టేసినట్లు సమాచారం.సదరు కాంట్రాక్టర్ లకు పౌరసరఫరాల శాఖ లోని ఉన్నతాధికారులు సహకారం అందించి బిల్లులు చెల్లించినట్లు తెలిసింది.గత 3 యేండ్లుగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నట్లు తెలిసింది.కొన్ని సెక్టార్ లలో 90% రైతులు తమ ధాన్యాన్ని వారి వారి స్వంత ట్రాక్టర్ లలో మిల్లులకు తరలించినట్లు సమాచారం. లారీల్లో కాకుండా రైతులే వాహనాల్లో ధాన్యం తీసుకొస్తే మరి పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఓ పి ఎం ఎస్ వివరాలు ఏమని నమోదు చేశారో వారికే తెలియాలి. రవాణా కాంట్రాక్టర్లు లారీల్లో ధాన్యం తరలించని విషయం అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ బిల్లులు ఎలా చెల్లించారో అర్ధం కాని పరిస్థితి.ఇలా ఒక్కో సీజన్ కు 2 కోట్ల రూపాయల పైచిలుకు ప్రభుత్వ సొమ్ము అక్రమంగా కాంట్రాక్టర్ల కు అధికారులు కట్టబెట్టినట్లు సమాచారం.
రికార్డుల్లో మాత్రమే లారీలు కనిపిస్తాయి…
Civil Supplies Hanmakonda : హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతీ సీజన్ కు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు టెండర్ లు పిలుస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు లారీల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి. కానీ జిల్లా వ్యాప్తంగా సుమారు 60 శాతం రైతులు ఎవరికి వారే వాహనాలు ఏర్పరచుకొని మిల్లులకు ధాన్యం తరలించినట్లు విశ్వసనీయ సమాచారం. మరీ ముఖ్యంగా జిల్లాలోని కమలాపూర్ సెక్టార్ లోనైతే ప్రతీ సీజన్ లో అసలు లారీలే అవసరం లేకుండా రైతులు ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు తెలిసింది.ఇలా ఈ సెక్టార్ లో 90%రైతులు సొంత వాహనాల్లోనే ధాన్యం తరలించడం గమనార్హం. అలాంటప్పుడు సదరు ధాన్యం రవాణా కాంట్రాక్టర్ కు ప్రతి సీజన్ లో బిల్లులు చెల్లించడం వెనక మర్మమేమిటో అధికారులకే తెలియాలి.
రవాణా ఛార్జీల్లోనూ కోత..
కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని లారీల్లో తరలించడానికి ఒక్కో క్వింటాలుకు ప్రభుత్వం ఈ యేడాది 32 రూపాయలు చెల్లిస్తోంది.అయితే ఒక్కో యేడాది లో ఒక్కో రకంగా రవాణా చార్జీలు మారుతుంటాయి.అయితే టెండర్ దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్ లు లారీలు పెట్టకుండానే బిల్లులు పొందుతున్నారు.రవాణా ఛార్జీల విషయం తెలుసుకున్న కొందరు రైతులకు సదరు కాంట్రాక్టర్లు ఏదో సొంతంగా వారి జేబుల్లోనుండి తీసి ఇచ్చినట్లు ముప్పు తిప్పలు పెట్టి గరిష్టంగా 15 రూపాయల వరకు చెల్లించినట్లు తెలిసింది. వీరు లారీలు పెట్టేది ఉండదు అలాగని ధాన్యాన్ని తరలించింది లేదు కానీ ప్రభుత్వం చెల్లించే రవాణా బిల్లులు మాత్రం అప్పనంగా నొక్కేస్తున్నట్లు ,అధికారులు సైతం వీరికి పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు
పాఠకులు గమనించగలరు.. హన్మకొండ జిల్లాలో ధాన్యం రవాణా కుంభకోణం చాలా పెద్దది అయినందున ఒకే వార్తలో పూర్తి కథనాన్ని ప్రచురించలేకపోతున్నాము. రెండు లేదా మూడు పార్టుల్లో కథనాలను వెలువరించడం జరుగుతుంది..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..