Local Body Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Gram Panchayat Elections 2025) అంతా సిద్ధమైంది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు దశల్లో విడుతల్లో పోలింగ్ ను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో జరిపించనున్నారు.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడుత పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడుత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడుత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడుత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడుత పోలింగ్ ఉంటుంది. ఇక మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరణ, నవంబర్ 8న పోలింగ్ నిర్వహించనున్నారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 555 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ వెల్లడించారు. 5749 ఎంపీటీసీ స్థానాలకు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 1.12 లక్షల పోలింగ్ స్టేషన్లు గుర్తించామన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఆదివారం సాయంత్రమే గెజిట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు.
Local Body Elections : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ (మూడు దశలు)
| క్ర.సం. | ఎన్నికల కార్యక్రమం | 1వ దశ | 2వ దశ | 3వ దశ |
|---|---|---|---|---|
| 1. | నామినేషన్ల దాఖలు ప్రారంభం | 17.10.2025 (శుక్రవారం) | 21.10.2025 (మంగళవారం) | 25.10.2025 (శనివారం) |
| 2. | నామినేషన్ల స్వీకరణకు తుది గడువు | 19.10.2025 (ఆదివారం) | 23.10.2025 (గురువారం) | 27.10.2025 (సోమవారం) |
| 3. | నామినేషన్ల పరిశీలన | 20.10.2025 (సోమవారం) | 24.10.2025 (శుక్రవారం) | 28.10.2025 (మంగళవారం) |
| 4. | పోటీ నుంచి విరమణ తుది గడువు | 23.10.2025 (గురువారం) | 27.10.2025 (సోమవారం) | 31.10.2025 (శుక్రవారం) |
| 5. | పోలింగ్ తేదీ | 31.10.2025 (శుక్రవారం) | 04.11.2025 (మంగళవారం) | 08.11.2025 (శనివారం) |
| 6. | ఓట్ల లెక్కింపు | 31.10.2025 (శుక్రవారం) మ. 2:00 గంటల నుండి | 04.11.2025 (మంగళవారం) మ. 2:00 గంటల నుండి | 08.11.2025 (శనివారం) మ. 2:00 గంటల నుండి |
గ్రామ పంచాయతీ ఎన్నికల వివరాలు
| జిల్లా పేరు | మండలం పేరు | ఎంపీటీసీ పేరు | గ్రామ పంచాయతీ పేరు | వార్డుల సంఖ్య |
|---|---|---|---|---|
| ములుగు | మంగపేట | కమలాపురం-I | కమలాపురం | 16 |
| ములుగు | మంగపేట | మంగపేట | మంగపేట | 12 |
| ములుగు | మంగపేట | కొమటిపల్లి | కొమటిపల్లి | 8 |
| ములుగు | మంగపేట | చెరుపల్లి | చెరుపల్లి | 10 |
| కరీంనగర్ | వి. సైదాపూర్ | — | కుర్మపల్లి | 8 |
| మొత్తం | — | 14 ఎంపీటీసీలు | 27 గ్రామ పంచాయతీలు | 246 వార్డులు |








