Industrial Training : నేటి ఆధునిక యుగానికి అనువుగా యువతకు ఉద్యోగావకాశాలు, జీవనోపాధి కల్పించే విధంగా శిక్షణ కేంద్రాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. పాతతరం ఐటీఐల (Industrial Training Institutes (ITIs)కు కొత్త రూపు ఇవ్వాలని సంకల్పించింది. అత్యాధునిక సదుపాయాలతో కూడిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ (Advanced Technology Centres (ATCs)గా ఐటీఐలను మార్చింది.
Industrial Training : సెప్టెంబరు 27 నుంచి ప్రారంభం
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏర్పాటు తన డ్రీమ్ ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ( Chief Minister A. Revanth Reddy) అంటున్నారు. ఆధునిక సాంకేతిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త శిక్షణా కేంద్రాల (modern institutes)ను సెప్టెంబరు 27న హైదరాబాద్‌లోని మల్లేపల్లి ఐటీఐలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. అదే సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని సెంటర్లను ప్రారంభిస్తారు.
రూ. 2,379 కోట్లతో 65 ఐటీఐల అప్‌గ్రేడేషన్
టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో అమల్లోకి వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 65 ఐటీఐలను ATCలుగా మార్చారు. ఇందుకు మొత్తం రూ. 2,379.63 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 363.38 కోట్లు కేటాయించగా, మిగతా వ్యయాన్ని టాటా టెక్నాలజీస్ ఖర్చు చేస్తోంది.
ఆధునిక సదుపాయాలు.. అత్యాధునిక శిక్షణ
ప్రతి ATCలో 13,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక వర్క్‌షాప్‌లు, అత్యాధునిక యంత్రాలు, పరికరాలు, శిక్షణ వనరులు ఏర్పాటు చేశారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ప్రొడక్ట్ డిజైన్, ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత, 3D ప్రింటింగ్, మాన్యుఫాక్చరింగ్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
కొత్త తరహా కోర్సులు
టాటా టెక్నాలజీస్ రూపొందించిన కొత్త తరహా కోర్సుల్లో కొన్ని:
- అడ్వాన్స్‌డ్ CNC మెషినింగ్
- ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్
- మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్
- ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్
 ఈ కోర్సులు విద్యార్థులను భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్‌గా తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
భారీ డిమాండ్ – సీట్లన్నీ దాదాపు భర్తీ
ఈ విద్యాసంవత్సరానికి 11,008 దీర్ఘకాలిక కోర్సు సీట్లలో 10,869 (99%) ఇప్పటికే నిండిపోయాయి. వచ్చే సంవత్సరం నుంచి 1.25 లక్షల షార్ట్-టర్మ్ కోర్సు సీట్లు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం ప్రకారం టాటా టెక్నాలజీస్ ప్రతి ATCకి ఇద్దరు చొప్పున మాస్టర్ ట్రైనర్లు (మొత్తం 130), 12 మంది ట్రైనర్ల (మొత్తం 780)ను నియమించింది.
జాతీయ గుర్తింపు – విద్యార్థులకు మరిన్ని అవకాశాలు
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (DGT) , నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) ఈ 65 ATCలకు అధికారిక అనుబంధం కల్పించాయి. దీంతో ఇక్కడి కోర్సులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. దీంతో విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం మరింత పెరిగింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    