- మరి కాంగ్రెస్ మార్క్ ఎక్కడ ?
- ధరణికి, భూ భారతికి కనిపించని వ్యత్యాసం..
- ధరణిని విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అదే మార్గాన్ని అనుసరిస్తోందని విమర్శలు
- భూభారతిలో ఆ నిబంధనలు తీసుకురావాలంటున్న రెవెన్యూ అధికారులు, ప్రజలు..?
Bhoobharati vs Dharani | పది సంవత్సరాల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పాలనలో కల్వకుంట్ల కుటుంబంతోపాటు వాళ్ల అనుచరులు ధరణి (Dharani) పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు పదే పదే బహిరంగ సమావేశాల్లో, ప్రెస్ మీట్‌లలో అనేక రకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం తామేదో గొప్పగా ధరణిలోని లోపాలను సవరించుకుంటూ దానికంటే అద్భుతమైన ఆర్‌వోఆర్ చట్టాన్ని తీసుకువస్తామని చెప్పి అదే పోర్టల్ పేరు మార్చి భూభారతి (Bhoobharati ) పేర ప్రవేశపెట్టారని క్షేత్రస్థాయిలో ప్రజలతోపాటు రెవెన్యూ అధికారులు సైతం భూభారతి పట్ల అసహనంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
గత ప్రభుత్వం తీసుకొచ్చిన “ధరణి” లో అనేక లోపాలున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతిని ప్రారంభించింది. కానీ భూభారతి కి, ధరణి కి కొన్ని కొన్ని అంశాల్లో అసలు తేడానే లేదని ధరణి లో ఏవిధంగానైతే లోపాలు ఉన్నాయో అదే విధంగా భూభారతిలో కూడా చిన్న చిన్న లోపాలు ఉన్నాయని స్వయంగా రెవెన్యూ అధికారులే చెబుతుడడం గమనార్హం. బిఆర్ఎస్ ప్రభుత్వం రాక ముందు తహశీల్దార్ కార్యాలయాల్లో నాలా కన్వర్షన్ చేయాలన్న, భూమికి పట్టా పాస్‌బుక్‌లు జారీ చేయాలన్నా కనీస నిబంధనలు ఉండేవి. కానీ ధరణి వచ్చాక పైన పేర్కొన్న వాటికి అసలు నిబంధనలే లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్టర్లు, తహశీల్దార్లు ఆడిందే ఆట పాడిందే పాటగా మారిపోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలోనైనా పరిస్థితి మారిందా అంటే అదీ లేదు. అచ్చం ధరణిలో ఏ విధంగానైతే అనుమతి లేని వెంచర్లలో నాలా కన్వర్షన్లు, పట్టా పాస్‌బుక్‌ల దందా జరిగిందో, భూభారతి లో కూడా అదే విధమైన దందా జోరుగా సాగుతోంది.
అసలేం జరుగుతుంది…
రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలువడానికి ప్రధాన కారణం అప్పుడు “ధరణి” అయితే ఇప్పుడు “భూభారతి (Bhoobharati ) “అని చెప్పవచ్చు. కొంతమంది రియల్టర్ ధనార్జనే ధ్యేయంగా ఎక్కడ పడితే అక్కడ ఎకరం, రెండెకరాలు కొనుగోలు చేసి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల్లో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా వెంచర్లు చేసి సామాన్య ప్రజలకు అందులోని ప్లాట్లను అంటగడుతున్నారు.నాన్ లేఅవుట్ వెంచర్ లలోని ప్లాట్లను కొన్న సామాన్యులు గృహ నిర్మాణానికి అనుమతులు రాక ,అటు ప్లాట్లను కొనుగోలు చేసేందుకు తెచ్చిన అప్పులు తీర్చలేక సతమతమవుతున్న పరిస్థితి అటు గ్రామాల్లో ఇటు పట్టణాల్లో కనిపిస్తోంది.దీనికంతటికీ ప్రధాన కారణం అప్పుడు ధరణి అయితే ఇప్పుడు భూభారతి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి ధరణిలో కానీ, ఇప్పటి భూభారతి లో కానీ నాలా కన్వర్షన్ లకు, పట్టా పాస్ బుక్ లు చేయడానికి కానీ ఎటువంటి నిబంధనలు లేవు.
భూభారతి, ధరణి కంటే ముందు తహశీల్దార్ లు నాలా కన్వర్షన్ చేయాలంటే కనీసం 10 గుంటల భూమిని అయితేనే కన్వర్షన్ చేసేవారు. అలాగే పట్టా పాస్ బుక్ జారీచేయాలన్నా కనీసం 10 గుంటల భూమి ని కొనుగోలు చేస్తేనే పాస్ బుక్ లు జారీ అయ్యేవి. కానీ ధరణిలో అలాగే భూభారతి లో 100 గజాలకు,120,150,170 తదితర గజాలకు నాలా కన్వర్షన్ లు చేస్తున్నారు. అలాగే ఎకరం భూమిలో 15 నుండి 20 ప్లాట్లకు అంటే 1 గుంట ,2 గుంటలకు పాస్ బుక్ లు జారీ చేస్తున్నారు.వీటివెనుక తహశీల్దార్ లకు రియల్టర్ ల నుండి ప్లాట్ల వారీగా పెద్దమొత్తంలో ముడుపులు అందుతున్నాయి.
ముడుపుల విషయం పక్కన పెడితే తహశీల్దార్లు నాలా కన్వర్షన్,పట్టా పాస్ బుక్ లు చేయాలంటే గతంలో లాగా కనీసం 10 గుంటలు ఉండాలనే అనే నిబంధన కనుక రెవెన్యూ శాఖ తీసుకువస్తే అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది.విచ్చలవిడి కన్వర్షన్ లు,గుంట రెండు గుంటల కు పాస్ బుక్ ల అంశంపై కొంతమంది తహశీల్దార్ లను ప్రశ్నిస్తే ప్రభుత్వమే అలాంటి కఠిన నిబంధనలు తీసుకువస్తే మేము కూడా చేయము కదా అని స్పష్టం చేస్తున్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి లో పైన పేర్కొన్న సవరణ చేసి ఇటు ప్రభుత్వ ఆదాయం పెంచటంతోపాటు అటు నాన్ లేఅవుట్ వెంచర్ లకు అడ్డుకట్టవేసి సామాన్యులను నాన్ లేఅవుట్ వెంచర్ లవైపు చూడకుండా చేయాలని రెవెన్యూ అధికారులతోపాటు, సామాన్యులు సైతం కోరుకుంటున్నారు.
ప్రజలు, అధికారులు కోరుతున్న మార్పులు:
- కనీస భూమి పరిమితిపై స్పష్టమైన జీవో
- పాస్ బుక్స్ జారీకి పరిమితి నిబంధనలు
- నాన్ లేఅవుట్ వెంచర్లకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట
- భూభారతి ప్రక్రియలో పారదర్శకత
- తహసీల్దార్ స్థాయిలో అపరిమిత అధికారాలను తగ్గించాలి
Bhoobharati : ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన కీలక అంశాలు:
- భూ భారతిని ప్రజలకు నమ్మకం కలిగించేలా పునరుద్ధరించాలి
- రాజకీయ ఆరోపణలకు అర్థవంతమైన సమాధానం ఇవ్వాలి
- ధరణిలో జరిగిన తప్పిదాలను భూభారతిలో పునరావృతం కాకుండా చూడాలి
- రెవెన్యూ అధికారుల సలహాలు, ప్రజల సూచనలతో సవరణలు చేయాలి
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.