Telangana Govt Schemes : తెలంగాణ సర్కారు నాలుగు కొత్త పథకాలను రేపు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న రైతు భరోసా (Rythu bharosa), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ(Ration Cards), ఇందిరమ్మ ఇండ్ల పథకాలను (Indiramma housing Scheme) రేపు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామసభలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించనున్నారు. నాలుగు పథకాల ప్రారంభం, అమలుతీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వేర్వేరుగా శనివారం సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పవిత్ర దినోత్సవమైన గణతంత్ర దినోత్సవం నాడు ఈ నాలుగు పథకాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ శాంతి కుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
Telangana Govt Schemes : ప్రతీ పథకానికి ప్రత్యేక అధికారులు
ఈ సందర్భంగా సి.ఎస్ శాంతికుమారి మాట్లాడుతూ.. ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ ఊరిలో ఈ నాలుగు పథకాలను అర్హులైన లబ్దిదారులందరికీ మంజూరు పత్రాలు అందించాలని స్పష్టం చేశారు. 26న ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ పథకాల పండుగను గొప్పగా ప్రారంభించాలని శాంతికుమారి సూచించారు. నాలుగు పథకాలకు గాను రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్, ఇందిరమ్మ ఇండ్లకు ఎండీవో నేతృత్వంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ టీమ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకం ఏపీఓ టీమ్ లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సిఎస్ శాంతి కుమారి సూచించారు. పథకాల ప్రారంభోత్సవ ఏర్పాట్లు వెంటనే పూర్తిచేసుకోవాలని ఆమె చెప్పారు.
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను (Govt Schemes inauguration ) ఊరూరా పండగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సభకు లబ్దిదారులందరూ హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామసభలో ప్రముఖంగా ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ప్రతీ గ్రామానికి మండల స్పెషల్ అధికారి ఇంఛార్జిగా నియమించాలన్నారు. జిల్లా కలెక్టర్లు అర్హుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సి.ఎం కార్యాలయ కార్యదర్శులు శేషాద్రి, చంద్ర శేఖర్ రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్ , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








