అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీకి ఆదేశాలు
Urea Distribution in Telangana : తెలంగాణలో కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే యూరియా బస్తాల కోసం పీఏసీఎస్ ల వద్ద క్యూలో పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లలో చెప్పులు, పాస్ పుస్తకాలు పెడుతున్న దృశ్యాలు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తోపులాటలు, ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరాపై కీలక వ్యాఖ్యలు చేసింది.
యూరియా పంపిణీ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఆదేశాలు జారీ చేశారు. యూరియా పంపిణీలో క్యూ లైన్స్ లాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు సజావుగా యూరియా పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేపట్టాలని మంత్రి తుమ్మల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద రైతు వేదిక (Raithu Vedika)ల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ePOS మిషన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టారు.
రైతులకు ముందుగానే టోకెన్లు జారీ
రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేసిక్యూ లైన్లు లేకుండా తోపులాటలు లేకుండా యూరియా పంపిణీ (Urea Distribution ) సజావుగా సాగింది. యూరియా పంపిణీ పై మంత్రి తుమ్మల ఆదేశాలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. రైతు వేదికల వద్ద యూరియా పంపిణీ మొదటి రోజు ఎలాంటి ఆందోళనలు లేకుండా సజావుగా సాగుతుండటంతో అదే పద్ధతిలో పకడ్బందీగా యూరియా పంపిణీ చేయాలని మంత్రి తుమ్మల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జియో పాలిటిక్స్ వల్ల యూరియా ఇంపోర్ట్ లేకపోవడం, దేశీయంగా ఉత్పత్తి డిమాండ్ కు తగ్గట్టు లేకపోవటం వల్ల తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ మంత్రి తుమ్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో ఆగస్ట్ లో అదనంగా నలభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తెచ్చుకున్నామని తెలిపారు. ఇక మీదట ప్రతి రోజు 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా వివిధ కంపెనీలు సరఫరా చేసేలా సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తితో యూరియా సరఫరా మెరుగుపడిందని మంత్రి తుమ్మల తెలిపారు.
రాజకీయ విమర్శలు
కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేసి రేవంత్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల కోరారు. రైతులకు ప్రజా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందనీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








