TG Govt to build Ratan Tata Road : ప్రముఖ పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా స్మారకార్థం తెలంగాణ ప్రభుత్వం (Telangana government) ఓ కొత్త రహదారిని నిర్మించనుంది. గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణం చేపట్టి హైదరాబాద్ రింగ్ రోడ్డు (ORR)లోని రావిర్యాల్ నుంచి ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (RRR) లోని అమనగల్ వరకు ఫ్యూచర్ సిటీ మీదుగా అనుసంధానం చేయనుంది. ఈ కొత్త రహదారికి రతన్‌టాటా రోడ్ అని నామకరణం చేయనుంది.
Ratan Tata Road : రూ. 4,030 కోట్ల వ్యయం
రతన్ టాటా స్మారక గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డును సుమారు రూ. 4,030 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. మొత్తం 41.50 కిలోమీటర్ల పొడవుతో ఈ రహదారి నిర్మాణాన్ని చేపట్టనుంగా రెండు దశల్లో పనులు సాగనున్నాయి. మొదటి దశలో ORR లోని రావిర్యాల్ నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కిలోమీటర్ల రహదారి నిర్మాణం జరుగుతుంది, దీని కోసం రూ. 1,665 కోట్లు కేటాయించారు. రెండో దశలో మీర్‌ఖాన్‌పేట్ (ఫ్యూచర్ సిటీ) నుంచి RRR లోని అమనగల్ వరకు 22.30 కిలోమీటర్ల రహదారిని నిర్మించనున్నారు. దీని కోసం రూ. 2,365 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL)కు అప్పగించారు. ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. దీని వివరాలు HMDA అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
నగరంలో రేడియల్ రహదారులు
హైదరాబాద్ నగరంలో రహదారి వ్యవస్థను మెరుగుపరచడానికి రేడియల్ రహదారులు (Radial Roads) ముఖ్యపాత్ర పోషిస్తాయి. నగరంలోని అంతర్గత రింగ్ రోడ్ (Inner Ring Road), ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) మధ్య మెరుగైన సంబంధాన్ని కల్పించేందుకు దోహదపడతాయి. మొత్తం 33 రేడియల్ రహదారులు నిర్మితమవుతాయని HMDA పేర్కొంది. ఇవి పూర్తయిన తర్వాత నగరంలో ట్రాఫిక్ ప్రవాహం సులభతరం అవుతుంది.
ట్రాఫిక్ సమస్యలను నియంత్రించేందుకు చర్యలు
రీజినల్ రింగ్ రోడ్ (Regional Ring Road) కూడా హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ నగర అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ రహదారి సుమారు 340 కిలోమీటర్ల పొడవుతో ప్రధాన జాతీయ రహదారులను (NH 65, NH 44, NH 163, NH 765) కలుపుతుంది. ఇది నగరానికి చుట్టుపక్కల ఉన్న జిల్లాలను కలిపి ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.నగరంలో రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలోరతన్ టాటా రహదారి నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నగర అభివృద్ధికి, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, ప్రాంతీయ సంబంధాలను మెరుగుపరచేందుకు దోహదపడుతుంది.
Ratan Tata Road : రతన్ టాటా పేరే ఎందుకు?
ఈ రహదారి పేరు ఎందుకు రతన్ టాటా అని నిర్ణయించారనే ప్రశ్న చాలా మందికి వస్తోంది. భారతదేశంలో పారిశ్రామిక రంగానికి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించిన గొప్ప పారిశ్రామికవేత్తల్లో రతన్ టాటా ఒకరు. ఆయన తన జీవితాన్ని భారత పారిశ్రామిక అభివృద్ధికి అంకితం చేశారు. ముఖ్యంగా టాటా గ్రూప్ ద్వారా అనేక ప్రజలకు ఉపాధిని కల్పించారు. తెలంగాణలో రతన్ టాటా రహదారి ప్రాజెక్ట్ (Ratan Tata Road Project) , భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య రంగానికి, రవాణా వ్యవస్థకు కీలక ప్రాజెక్ట్‌గా నిలవనుంది. ఈ రహదారి ద్వారా నగరాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే, పరిశ్రమలు, వ్యాపార రంగాలు, రియల్ ఎస్టేట్, ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్ట్ వేగంగా పూర్తయితే,ఇది హైదరాబాద్ నగర అభివృద్ధికి మరింత దోహదం చేసే ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








