TG News | తెలంగాణ హైకోర్టు (Telangana High court)కు ముగ్గురు న్యాయమూర్తులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. మద్రాస్ హైకోర్టుకు ఇద్దరిని నియమించాలని కూడా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీం కొలేజియం సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు వచ్చాయి.
ఆ న్యాయమూర్తులు ఎవరెవరంటే..
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు(Judges)గా ఉన్న న్యాయమూర్తి లక్ష్మీనారామయణ అలిశెట్టి, న్యాయమూర్తి అనిల్ కుమార్ జుకంటి, న్యాయమూర్తి సుజానా కళాసికంలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించినట్టు సుప్రీం (Supreme Court ) తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే మద్రాస్ హైకోర్టులో న్యాయమూర్తులు వెంకటాచారి లక్ష్మీనారాయణన్, పెరియసామి వడమలైలను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసినట్లు కొలేజియం తెలిపింది.
ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు?
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులను రాష్ట్రపతి 217వ ఆర్టికల్ 1వ నిబంధన ప్రకారం నియమించాల్సి ఉంటుంది. అదనపు న్యాయమూర్తిని శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని ప్రతిపాదనలు వచ్చినప్పుడు ప్రధాన న్యాయమూర్తి తన సిఫార్సుతో పాటు ఆ న్యాయమూర్తి విచారణ చేసిన కేసుల వివరాలు, ఆయన ఇచ్చిన తీర్పులు, వివిధ జనరల్స్‌లో ప్రచురితమైన కేసుల సంఖ్యలను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో పాటు మొత్తం పని దినాలు, న్యాయమూర్తి నిజానికి కోర్టుకు హాజరైన రోజులు, ఆయన గైర్హాజరైన రోజుల వివరాలను కూడా అందించాలి.
అదనపు న్యాయమూర్తులను రాష్ట్రపతి 224వ ఆర్టికల్ 1వ నిబంధన ప్రకారం నియమించొచ్చు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన విధాన పత్రం (MoP) ప్రకారం శాశ్వత న్యాయమూర్తి ఖాళీ ఉన్నప్పుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అదనపు న్యాయమూర్తి నియామకానికి సిఫార్సు చేయకూడదు.
ప్రతిపాదనలు ఎందుకంటే..
సుప్రీంకోర్టు కొలేజియం అనేది భారతదేశంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అత్యున్నత సంస్థ. ఇది ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడి ఉంటుంది.
శాశ్వత న్యాయమూర్తి అంటే ఒక హైకోర్టులో జీవితాంతం పనిచేసే జడ్జి. అదనపు న్యాయమూర్తి అంటే ఒక హైకోర్టు(High court)లో కొంతకాలం పనిచేసే జడ్జి. తెలంగాణ హైకోర్టుకు ముగ్గురు, మద్రాస్ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వతంగా నియమించాలని సుప్రీం కొలేజియం ప్రభుత్వానికి సూచించింది. ఈ న్యాయమూర్తులు ఇప్పటికే అదనపు న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీం కొలేజియం సిఫార్సులు చేస్తోంది. సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు న్యాయమూర్తుల పనితీరు, విచారణ చేసిన కేసుల సంఖ్య, తీర్పుల నాణ్యత వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








