తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) చైర్మన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుత చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డి పదవీ కాలం డిసెంబర్ 3తో పూర్తి కానుంది. ఈ క్రమంలో కొత్త చైర్మన్ నియామకానికి ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. సుమారు 45 దరఖాస్తులు వొచ్చినట్లుగా తెలిసింది. రిటైర్డ్ ఐఏఎస్‌లు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ పోస్టు కోసం అప్లై చేసుకున్నారు. అందులో బుర్రా వెంకటేశ్ పేరును ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆమోదం కోసం ఫైల్‌ను రాజ్‌భవన్‌కు పంపించింది. తాజాగా ఆ ఫైల్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. డిసెంబర్ 3న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. 1995 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఐఏఎస్‌గా బుర్రా వెంకటేశంకు ఇంకా నాలుగేళ్ల సర్వీస్ ఉంది. 2030 వరకు ఆరేళ్ల పాటు ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.
బుర్రా వెంకటేశం ప్రస్తుత జనగామ జిల్లాలో 1968 ఏప్రిల్ 10న జన్మించారు. బుర్రా వెంకటేశం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ రెసిడెన్షియల్‌లో తన పాఠశాల విద్య పూర్తి చేశారు. 1995లో మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు & ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచారు. వెంకటేశం స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ పరిధిలోని ఓబుల్ కేశ్వపురం. 1996లో ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ విధుల్లో చేరారు. 1996లో చివర్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్ గా పనిచేశారు. 1998లో రాజమండ్రి సబ్ కలెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో వరంగల్ మునిసిపల్ కమిషనర్ గా, 2001లో చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా,
2003లో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు ప్రస్తుతం గవర్నర్ సెక్రటరీగా, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం కొనసాగుతున్నారు.
గురుకులాల్లో చదివిన విద్యార్థి ఐఏఎస్‌గా మారారని సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికలపై బుర్రా వెంకటేశం గురించి ప్రస్తావించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన బుర్రా వెంకటేశం ఎందరికో ఆదర్శప్రాయని ప్రశంసించారు. కాగా కాంగ్రెస్ సర్కార్ టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడగులు వేసింది. కమిషన్‌ను టీజీపీఎస్సీగా మార్చింది. మాజీ డీజీపీ, సీనియర్ ఐపీఎస్ ఎం మహేందర్‌రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఆయన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఈసారి సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను చైర్మన్‌గా నియమించింది.
Indiramma Illu| ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం