Ramagundam | పెద్దపల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామన్నారు.
కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వరి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇక రామగుండం, జైపూర్ ప్రాంతాల్లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తామని, త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. సింగరేణి, జెన్ కో సంయుక్తంగా రామగుండంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ (Tharmal Power Plants ) ను నిర్మిస్తాయని తెలిపారు. ప్రజా ప్రభుత్వాన్ని దీవించేందుకు పెద్ద ఎత్తున జనం కదిలిరావడం తమకు ఆక్సిజన్ అందించినట్లు ఉందని చెప్పారు.
ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నధాన్యం సాగు చేసిన వారికి క్వింటాకు రూ.500 బోనస్, వేలాది ఉద్యోగాల కల్పన వంటి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని, బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. మీరంతా నడుము బిగించి మీ ఉద్యోగాల కోసం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ ప్రభుత్వాన్ని స్థాపించారని భట్టి విక్రమార్క అన్నారు. మేం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే 56,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, ఇంకా మరిన్ని ఉద్యోగాలను క్యాెలంటర్ ప్రకారం ఇస్తామని ప్రకటించారు.
3 thoughts on “Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు”