Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బతికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్లలో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.
మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. “మీరు సమాజంలో గౌరవంగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించాం. కష్టపడి పనిచేస్తే మీకే కాకుండా, ఇతర ట్రాన్స్‌జెండర్లకు కూడా తలెత్తే భవిష్యత్తు ఏర్పడుతుంది. మీరు ఈ సమాజానికి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి” అని మంత్రి అన్నారు.
మహిళా, శిశు సంక్షేమ, ఎస్సీ డెవలప్‌మెంట్ విభాగం సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ… “ఇప్పటి వరకు ట్రాన్స్‌జెండర్‌లను తక్కువ చేసి చూశారు. ఇప్పుడు అదే సమాజం అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యం అవుతుంది. మీరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మీకే వస్తుంది” అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








