TTD Vaikunta Ekadasi 2025 tickets | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అశేష భక్తజనం పాల్గొనే ఈ ఆధ్యాత్మిక ఉత్సవం 2025 జనవరి 10 నుంచి 19 వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ 2024 డిసెంబరు 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) టికెట్ల బుకింగ్ 2024 డిసెంబరు 24 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యింది. భక్తులు తమ టికెట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
అందుబాటులోకి SSD టోకెన్లు
వైకుంఠ ద్వారం అనేది ఆలయ గర్భగృహాన్ని ప్రదక్షిణ చేసే పవిత్ర మార్గం. 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఇది తెరిచి ఉంటుంది. ఈ దర్శనానికి భక్తులు పోటెత్తనుండటంతో స్లాటెడ్ సర్వ దర్శనం (SSD) టోకెన్లను అందుబాటులో ఉంచారు. ఇవి కలిగిన వారికి మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం అనుమతి ఉంటుందని TTD వర్గాలు తెలిపాయి. టోకెన్లు లేనివారు తిరుమలకు రావచ్చు గానీ దర్శనం క్యూ లైన్లో ప్రవేశం లభించదని పేర్కొన్నాయి.
ప్రత్యేక కార్యక్రమాలు
వైకుంఠ ఏకాదశి రోజు (2025 జనవరి 10) :
- VIP ప్రోటోకాల్ దర్శనం ఉదయం 4:45 కు ప్రారంభం.
- ఉదయం 9:00 నుంచి 11:00 వరకు సువర్ణ రథం (బంగారు రథం) ఊరేగింపు . ద్వాదశి రోజు (2025 జనవరి 11) :
- చక్రస్నానం శ్రీవారి పుష్కరిణి (ఆలయ కొలను)లో ఉదయం 5:30 నుంచి 6:30 వరకు నిర్వహిస్తారు.
ప్రత్యేక ఏర్పాట్లలో TTD నిమగ్నం
వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఉత్సవం. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. వైకుంఠ ద్వారాన్ని దాటడం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన కార్యంగా భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. టికెట్ల బుకింగ్, దర్శనాన్ని TTD సులభతరం చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతోంది. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి వరకు అన్నదానం (ఉచిత భోజన పంపిణీ) ఏర్పాటు చేస్తారు. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కర పొంగలి వంటివి అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా 3.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసు విభాగం TTDతో కలిసి పనిచేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..