Udaan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరలు విపరీతంగా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. విమానాలు ఆకాశం వైపు దూసుకెళ్లినట్టే ఇక్కడి ధరలూ పైపైకి పోతుంటాయి. ఈ నేపథ్యంలోనే విమాన ప్రయాణికులకు అతి తక్కువ ధరల్లో ఆహారాన్ని అందించేందుకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Netaji Subhas Chandra Bose International Airport)లో ఉడాన్ యాత్రి కేఫ్ (Udaan Yatri Cafe) ప్రారంభమైంది. విమానాల్లో దొరికే ఆహారం ధరలకన్నా మూడింట రెండో వంతు రేట్లకే ఈ కేఫ్‌లో లభ్యమవుతున్నాయి.
Udaan Yatri Cafe ప్రత్యేకతలు
కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్‌లో అందించే ధరలు ఇలా ఉన్నాయి.
- టీ: రూ. 10
- వాటర్ బాటిల్: రూ. 10
- కాఫీ: రూ. 20
- సమోసా: రూ. 20
- స్వీట్లు: రూ. 20
ఇంత తక్కువ ధరల్లో ఈ పదార్థాలను అందించడం వల్ల ప్రయాణికుల నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ విశేష ఆదరణ పొందుతోంది. ఇది ప్రారంభమైన మొదటి నెలలోనే 27,000 మంది ప్రయాణికులు దీని సేవలు వినియోగించుకోవడం విశేషం.
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
ఉడాన్ యాత్రి కేఫ్ ద్వారా తమ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని అంటున్నారు విమాన యాత్రికులు. సాధారణంగా విమానాశ్రయాల్లో ఆహారం, పానీయాల ధరలు మార్కెట్ ధరల కంటే మూడింతలు ఎక్కువగా ఉంటాయి. ఉడాన్ యాత్రి కేఫ్ ను ప్రారంభించడం ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఆహారాన్ని పొందగలుగుతున్నామని అంటున్నారు. ఆహార కేంద్రం స్థాపనకు భారతీయ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కీలక పాత్ర పోషించాయి. ఈ వినూత్నమైన నిర్ణయాన్ని ప్రయాణికులు ప్రశంసిస్తున్నారు.
Hyderabadలో ఉడాన్ యాత్రి కేఫ్?
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రపంచ ప్రామాణిక సౌకర్యాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఉడాన్ యాత్రి కేఫ్‌ను కూడా ఇక్కడ అందుబాటులోకి తేనున్నారని తెలుస్తోంది. కోల్‌కతా (Kolkata)లో ఈ కేఫ్ విజయవంతం కావడంతో తదుపరి ప్రయత్నం హైదరాబాదులో ఉండే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
ఉడాన్ యాత్రి కేఫ్ విస్తరణపై కేంద్రం దృష్టి
మరికొన్ని విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌ను విస్తరించేందుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు ఉడాన్ యాత్రి కేఫ్‌ను తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రయాణికుల ఆకాంక్షలను తీర్చడమే కాకుండా విమానాశ్రయాల్లో పర్యావరణాన్ని సానుకూలంగా మార్చగలదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








