Rajnath Singh : యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా నడుస్తున్న రోజులు వచ్చేశాయని అన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defence Minister Rajnath). సాంకేతిక రంగంలో ప్రపంచం పురోగతి సాధిస్తోందన్నారు. కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రతికూల పరిస్థితుల్లో బలంగా, భద్రంగా ఉండాలంటే ఇది తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ తరాల్లో పోటీతత్వం పెంచాలి : Rajnath Singh
భారత జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీర్డీవో (DRDO), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ 2025 (Vigyan Vaibhav – 2025) సైన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్య అంటే కేవలం కేంద్రం లేదా రాష్ట్రాల బాధ్యతే కాదని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాలు కేవలం దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా తయారు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
దేశానికి నిపుణులైన యువత అవసరం
ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ విధానాల్లో మార్పులు వస్తున్న నేపథ్యంలో భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నిపుణులైన యువత అవసరం ఏర్పడిందని రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. యువత ఈ రంగంలో శిక్షణ తీసుకుంటే భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలంగా తీర్చిదిద్దొచ్చన్నారు.
DRDO లాంటి సంస్థలు దేశ భద్రత కోసం అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందులో భాగస్వామ్యం కావాలనే ఆసక్తి యువతలో పెరగాలని ఆకాంక్షించారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా విద్యార్థులు నూతన ఆవిష్కరణలను ప్రత్యక్షంగా వీక్షించి, భవిష్యత్తులో రక్షణ పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు దోహదపడతాయని తెలిపారు.
డిఫెన్స్ కారిడార్‌గా ప్రకటించండి: సీఎం రేవంత్‌రెడ్డి
దేశ రక్షణ రంగంలో తెలంగాణ (Telangana) దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిపోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో రక్షణ తయారీ యూనిట్లు ఏర్పడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణలోని ఒక లక్షకుపైగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ చదువుతున్న వారు అమెరికాకు వెళ్లిపోతున్నారని, వారికి దేశ రక్షణ వ్యవస్థ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ఈ శాస్త్రీయ ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణను డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. డఇది నూతన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అధిక సంఖ్యలో మిస్సైల్స్ తయారీ, కొత్త స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు దోహదపడుతుందని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..