UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్లవాత్మక వృద్ధి చెందుతోంది. డిజిటల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గణనీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR – క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్లడైంది.
తగ్గుముఖం పట్టిన ఇతర చెల్లింపులు
ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు.
సులువైన పద్ధతి.. అనువైన సాధనం UPI
డిజిటల్ చెల్లింపుల ప్రధాన శక్తిగా యూపీఐఎదగడానికి వినియోగదారులు చూపుతున్న ఆదరణే కారణమని తెలుస్తోంది. సులభమై పద్ధతి ద్వారా చెల్లింపులకు యూపీఐ అనువైన సాధనం కాగా దీని వినియోగం ఇటీవల గణనీయంగా పెరిగింది. ఇది కేవలం వ్యక్తిగతంగానే కాకుండా వ్యాపార అవసరాలను కూడా తీర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2018లో 375 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా 2024 నాటికి ఇది రూ. 17,221 కోట్లకు చేరుకుంది. అలాగే, మొత్తం లావాదేవీ విలువ 2018లో రూ. 5.86 లక్షల కోట్ల నుంచి 2024 నాటికి రూ. 246.83 లక్షల కోట్లకు పెరిగింది.
యూపీఐ.. డిజిటల్ చెల్లింపుల్లో ప్రగతి
గత కొన్నేళ్లలో భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులను చూసింది. దీనికి యూపీఐ వ్యవస్థ అభివృద్ధి చెందడం, డిజిటల్ చెల్లింపు పద్ధతుల విస్తరణే దీనికి ప్రధాన కారణం. 2024 సంవత్సరంలోనే డిజిటల్ చెల్లింపులు 208.5 బిలియన్ నమోదు కావడమే ఇందుకు నిదర్శనం.
UPI Lite ద్వారా లావాదేవీలు
భారతదేశంలో తక్కువ విలువ గల లావాదేవీలను సులభతరం చేయడం కోసం UPI Lite అనే పద్ధతిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించింది. 2024 డిసెంబర్ నాటికి రోజుకు 2.04 మిలియన్ UPI Lite లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ. 20.02 కోట్లు ఉంది. పేటీఎం, ఫోన్‌పేలో ఈ యూపీఐ లైట్ పద్ధతి 2023లో ప్రారంభమైంది. దీని తర్వాత UPI Lite చెల్లింపుల వాల్యూమ్వి, లువల్లో స్థిరమైన వృద్ధి కనిపించింది.
ఇతర దేశాలకు కూడా ఆదర్శం
యూపీఐ వల్ల భారతదేశం ప్రజా మౌలిక వనరుగా డిజిటల్ చెల్లింపులను అందించడంలో ప్రాముఖ్యత సాధించింది. ఇది ఇతర దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలకు ఈ చెల్లింపుల విధానాన్ని అందుబాటులోకి తేవడం, లావాదేవీలను సులభతరం చేయడంలో భారతదేశం ముందు వరుసలో ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..